రితికాను చంపేసిన గెలుపు పాఠం?

Update: 2021-03-19 15:30 GMT
ఆట గెలుపునే నెత్తిన పెట్టుకునే చోట.. మాన‌సికోల్లాసం అనే మాట‌కు చోటెక్క‌డిది? ఆట వ్యాపారంగా మారిన‌ చోట.. స్పోర్టివ్‌ స్పిరిట్ కు విలువెక్క‌డిది?? అస‌లు జీవిత అంతిమ ల‌క్ష్యం గెలుపే అని తీర్మానించిన స‌మాజంలో.. ఓడిపోయిన వారికి ఓదార్పు ఎక్క‌డి??? అందుకే వెళ్లిపోయింది! ఓడిపోతే ఎందుకూ ప‌నికిరావంటూ లోకం నేర్పిన పాఠం గుర్తు తెచ్చుకొని శాశ్వ‌తంగా వెళ్లిపోయింది! విజ‌యం సాధించ‌క‌పోతే జీవితానికి విలువే లేద‌ని, తానెందుకూ ప‌నికార‌ని తీర్మానించుకొని భారంగా నిష్క్ర‌మించింది యువ రెజ్ల‌ర్ రితిక‌!

జైపూర్ కు చెందిన 17 సంవ‌త్స‌రాల రితిక అద్బుత‌మైన రెజ్ల‌ర్ గా ఎదుగుతోంది. రాజ‌స్థాన్ లోని భ‌ర‌త్ పూర్ లో జ‌రిగిన రెజ్లింగ్ టోర్నీలో సూప‌ర్ పెర్ఫార్మెన్స్ తో ఫైనల్స్ కు చేరింది. అయితే.. మార్చి 14వ తేదీన జ‌రిగిన ఫైన‌ల్ లో ఓట‌మి పాలైంది. ఆ ఓట‌మి మ‌న‌సును ఎంత‌గా గాయ‌ప‌రిచిందో..? ఓడిపోయిన ముఖంతో ఇంటికి ఎలా వెళ్లాల‌న‌ని భావించిందో..? కఠిన నిర్ణయం తీసుకుంది. ఫైనల్ మ్యాచ్ జరిగిన మూడు రోజుల తర్వాత మార్చి 17న బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. జైపూర్ సమీపంలోని తన స్వ గ్రామంలో ఇంట్లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది.

చూడ‌డానికి ఇది ఒక ఆత్మ‌హ‌త్య‌గానే క‌నిపించొచ్చు. కానీ.. త‌ర‌చిచూస్తే అందులోని అగాథం అర్థ‌మ‌వుతుంది. ఏం చేసినా.. గెలుపే అంతిమం అని బోధిస్తున్న స‌మాజం చేస్తున్న హ‌త్య‌లుగానే వీటిని ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విద్యాసంస్థ‌ల్లో ఏటా కొన్ని వంద‌ల మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డంలో మెజారిటీ పాత్ర ‘విజ‌యానిదే’ అంటే అతిశయోక్ిత కాదు.

చేసే ప్ర‌తీ ప‌నిలో గెలుపుకు ఎంత అవ‌కాశం ఉంటుందో.. ఓట‌మికి సైతం అంతే వాటా ఉంటుంద‌ని చెప్ప‌డం ఈ స‌మాజం ఏనాడో మ‌రిచిపోయింది. ఇంట్లోని త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు మొద‌లు.. బ‌య‌టి వ్య‌క్తుల వ‌ర‌కూ గెలిస్తేనే నెత్తిన పెట్టుకోవ‌డం.. ఓడిపోతే ఎందుకూ ప‌నికిరాని వారిలా చూడ‌డం స‌ర్వాసాధార‌ణమైపోయింది. చ‌దువుల్లో కూడా గెలుపు గురించి మాత్ర‌మే నేర్పుతున్న విద్యాసంస్థ‌లు.. ఓట‌మి కూడా జీవితంలో ఓ భాగ‌మ‌ని చెప్ప‌క‌పోవ‌డం కూడా ఇలాంటి దారుణాల‌కు కార‌ణ‌భూత‌మ‌వుతున్నాయి. ఇక‌నైనా ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప‌రిగ‌ణించి, పిల్ల‌ల‌కు ఓడిపోవ‌డం కూడా నేర్పాల్సిన అవ‌స‌రం ఉంది. ఓట‌మిని మెట్టుగా మ‌లుచుకొని గెలుపు ఎలా సాధించాలో వివ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News