ది వైర్ మరో సంచలన కథనం.. రాహుల్ రెండు నెంబర్లు ఉన్నాయట

Update: 2021-07-20 05:01 GMT
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ‘ది వైర్’ మీడియా సంస్థ మరో సంచలనానికి తెర తీసింది. తాజాగా పెగాసన్ సంస్థ భారత్ తో పాటు ప్రపంచంలోని పలువురు ముఖ్యుల ఫోన్ నెంబర్లను హ్యాక్ చేసినట్లుగా వార్తలు రావటంతో పెనుదుమారం రేగింది. ముఖ్యంగా భారత్ కు చెందిన పలువురు కీలక నేతలు.. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు సుప్రీంకోర్టుకు చెందిన ఒక న్యాయమూర్తి ఫోన్ నెంబరును హ్యాక్ చేసినట్లుగా ఈ సంచలన కథనంలో పేర్కొన్నారు. ముందుగా ఊహించినట్లే పెగాసన్ హ్యాకింగ్ వ్యవహారం షాకింగ్ గా మారింది. కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కథనం పబ్లిష్ కావటం.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావటం ఒకే సమయంలో చోటు చేసుకోవటంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారంగా మారింది.

దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. హోం మంత్రి అమిత్ షాను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పెగాసన్ స్పై వేర్ లో మరికొందరు బాధితులు ఉన్నట్లుగా ది వైర్ మరో కథనాన్ని ప్రచురించింది. అందులో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి చెందిన కనీసం రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయని.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోన్ నెంబర్లతో పాటుకేంద్రమంత్రులు ప్రహ్లాద్ పటేల్.. అశ్వినీ వైష్ణవ్ లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యవహారం మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ.. వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయటంలో భాగంగానే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళలో ఈ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా మండిపడుతున్నారు. ఆదివారం ప్రచురించిన సంచలన కథనానికి కొనసాగింపుగా.. తాజాగా మరో కథనాన్ని ‘ది వైర్’ ప్రచురించింది. తాజా కథనంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

-  నిఘ లేదంటే హ్యాకింగ్ కోసం భారత్ కు చెందిన ఒక క్లయింట్ నుంచి ఎన్ఎస్ వో గ్రూప్ నకు 300లకు పైగా ఫోన్ నెంబర్లు అందాయి. వాటిల్లో రాహుల్ గాంధీకి చెందిన నంబర్లు మినిమం రెండు ఉన్నాయి.

-  గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే 2018-19 మధ్యన ఆయన్ను లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు అందాయి. 2019 తర్వాత ఆ నంబర్లను రాహుల్ గాంధీ వాడటం మానేశారు.

-  2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పని చేసి.. ఆ తర్వాత వివిధ పార్టీలకు సేవలు అందిస్తున్న రాజకీయ వ్యూహకర్త కమ్ వ్యాపారవేత్త ప్రశాంత్ కిశోర్ పేరు కూడా జాబితాలో ఉంది

-  మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా ఫోన్ కూడా హ్యాకైంది.

-  2019 సార్వత్రిక ఎన్నికల ప్రచార వేళలో ప్రధాని మోడీ.. హోంమంత్రి అమిత్ షాలపై కంప్లైంట్లు రావటం.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన తీర్పులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం తెలిసిందే.

-  ప్రస్తుతం కేంద్ర ఐటీ మంత్రిగా వ్యవహరిస్తున్న అశ్వినీ వైష్ణవ్ ఫోన్ ను 2017నుంచి టార్గెట్ చేశారు. అయితే.. అప్పట్లో ఆయన ఎంపీగా లేరు.

-  పెగాసన్ టార్గెట్ చేసిన లిస్టులో వాషింగ్టన్ పోస్ట్ కు చెందిన దివంగత జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ ప్రియురాలు హాటిస్ సెంగిజ్ కూడా ఉన్నారు. 2018లో ఇస్తాంబుల్ లోని సౌదీ అరేబియా కాన్సులేట్ లో దారుణ హత్యకు గురి కావటం పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకే ఆమె ఫోన్ లోకి ఈ స్పైవేర్ చొప్పించినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News