ఐఫోన్ ఆ దేశంలో చాలా చౌకట

Update: 2017-01-19 06:25 GMT
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. దేశం ఏదైనా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఐఫోన్ ను వాడేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే.. దీని రేటు విన్న చాలామంది వెనక్కి తగ్గుతుంటారు. నిత్యం ఊరించే ఐఫోన్ ను సొంతం చేసుకునేందుకు.. చేతిలో ఠీవీగా పట్టుకునేందుకు చాలామంది కల కంటుంటారు.కానీ.. దాని ధర పుణ్యమా అని చాలామంది సామాన్యుల కల నెరవేరని పరిస్థితి.

మరి.. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ ధర ఒకేలా ఉంటుందా? అంటే కాదనే చెప్పాలి. కొన్ని దేశాల్లో తక్కువగా.. మరికొన్ని చోట్ల కాస్ట్ లీగా ఉండే ఈ ఫోన్ తో పాటు.. దాదాపు 14 రకాల గ్యాడ్జెట్ల ధరలపై లినియో అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఉండే ధరల్ని పరిశీలిస్తూ.. ఏ దేశంలో ఏ ప్రొడక్ట్ ధర తక్కువగా ఉంటుంది? ఏ దేశంలో ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ఈ సర్వేలో తేల్చారు.

మిగిలిన గ్యాడ్జెట్లను పక్కన పెట్టి ఐఫోన్ ముచ్చటనే చూస్తే.. ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం 72 దేశాల్లో ఐఫోన్ ధరల్ని చూసినప్పుడు..ఐఫోన్ ధర తక్కువగా అంగోలాలో దొరుకుతుందని తేల్చారు. ఇక్కడ ఐఫోన్ సగటు ధర రూ.27,290గా తేల్చారు. డాలర్లలో చెబితే 401.4గా చెబుతున్నారు. అదే సమయంలో భారత్ లో అయితే మాత్రం 505.25 డాలర్లుగా తేల్చారు. ఇక.. అమెరికాలో అయితే ఇది మరికాస్త పెరిగి 635.88డాలర్లుగా ఉంటుందన్న లెక్క తేలింది.

ఇదిలా ఉంటే.. ఆర్థిక మాంద్యం విపరీతంగా ఉన్న వెనిజులా దేశంలో ఐఫోన్ కొనటం అపర కేబేరులు సైతం కాస్త ఆలోచించాల్సిందేనట. ఎందుకంటే.. ఆ దేశంలో ఐఫోన్ సగటు ధర 97,813డాలర్లుగా తేల్చారు. అదే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.66లక్షలకు పై మాటే. ద్రవ్యోల్బణం.. స్థానిక పన్నులు.. మారక విలువ ఆధారంగా ఐఫోన్ ధరల్లో తేడాలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా ఐఫోన్ ను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలంటే అంగోలాకు వెళ్లటమో.. అక్కడి నుంచి వచ్చే వారి నుంచి తెప్పించుకోవటం లాంటివి చేయాలన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News