ఎడ‌మ బాలాజీ ఎక్క‌డ బాబూ.. కొత్త త‌మ్ముడు కావాలా?

Update: 2020-12-20 16:30 GMT
ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు సంబంధించి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు చేసిన ప్ర‌యోగం ఫ‌లించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీ నుంచి వ‌చ్చిన ఎడ‌మ బాలాజీని చీరాల ఇంచార్జ్‌గా నియ‌మించారు. వైసీపీ త‌ర‌పున ఆయ‌న కొన్నాళ్లు ఇక్క‌డ చ‌క్రం తిప్పారు. అయితే.. చివ‌రి నిముషంలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వైసీపీలోకి రావ‌డంతో ఎడ‌మ బాలాజీకి ద‌క్కాల్సిన టికెట్ ఆమంచి ఖాతాలో ప‌డింది. దీంతో అలిగిన ఎడ‌మ హుఠాహుఠిన సైకిల్ ఎక్కారు. ఆ వెంట‌నే ఇంచార్జ్ పీఠం అప్ప‌గించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో మాత్రం బాలాజీ దూకుడు చూపించ‌క పోగా.. బ‌య‌ట‌కు కూడా రాక‌పోవ‌డం.. పార్టీని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

ఇటీవ‌ల పార్టీ కేటాయించిన ప‌ద‌వుల్లో బాలాజీకి చోటు పెట్ట‌లేదు. దీంతో త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ల‌భిస్తుందో లేదో అనే ఆందోళ‌న‌తో ఏకంగా పార్టీకి దూరంగా ఉన్నారు. వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో చీరాల‌లో టీడీపీ ఎదిగేందుకు చాలా అవ‌కాశం ఉంది. వైసీపీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య పోరులో బిజీగా ఉన్నారు. చీరాల నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం.. వైసీపీలోకి రావ‌డం.. వైసీపీలో ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. క‌ర‌ణంపై క‌త్తి దూస్తున్న వైఖ‌రితో నియోజ‌క‌వర్గం స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక ఏ ఒక్క‌రికీ క‌నిపించ‌డం లేదు. పైగా సామాజిక వ‌ర్గాల వారీగా కూడా గ్రూపులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో ఈ గ్యాప్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని దూకుడు ప్ర‌ద‌ర్శించేందుకు బాలాజీకి అవ‌కాశం ఉంది.

పైగా టీడీపీ నేత‌లు ఎవ‌రూ కూడా ఆయ‌న‌కు పోటీ లేకుండా ఉండ‌డం.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నేత‌లు.. ఇక్క‌డ వేలు పెట్ట‌కుండా ఉండ‌డం వంటి ప‌రిణామాలు బాలాజీకి క‌లిసి వ‌స్తున్నాయి. ఆయ‌న ముందుకు వ‌స్తే.. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన నాయ‌కులు కూడా జెండా ప‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంది. అయినా కూడా త‌న‌కు టికెట్ విష‌యంలో నెల‌కొన్ని సందిగ్ధంతో బాలాజీ అస‌లు గ‌డ‌ప కూడా దాట‌టం లేదు. ఈ క్ర‌మంలో టీడీపీ విష‌యం ఇక్క‌డ వినిపించ‌డం లేదు. మ‌రి ఇప్ప‌టికైనాచంద్ర‌బాబు జోక్యం చేసుకుని.. ఇక్క‌డ నేత‌ను మార్చ‌డ‌మో.. లేక బాలాజీకి కౌన్సెలింగ్ ఇచ్చి దూకుడు పెంచ‌డ‌మో.. చేయాల‌ని కోరుతున్నారు టీడీపీ సానుభూతిప‌రులు. మంచి అవ‌కాశం మిస్స‌యిపోయి.. ఎన్నిక‌ల‌కు ముందు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వెళ్తామంటే ఎలా అనే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. సో.. బాబు ఇప్ప‌టికైనా ఇక్క‌డి ప‌రిస్థితిని స‌రిదిద్దాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.





Tags:    

Similar News