నాడు లాడెన్.. నేడు బాగ్దాదీ .. సముద్ర గర్భంలో కలిపేసిన అమెరికా

Update: 2019-10-29 06:54 GMT
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సిరియాలోని ఇడ్లిస్ ప్రావిన్స్ బారిషాలో గల తన స్థావరంలో బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నారు. బాగ్దాది ఎక్కడ ఉన్నాడో కనిపెట్టిన తరువాత అమెరికా సైనిక బలగాలు ఈ నెల 27వ తేదీన అతని స్థావరాన్ని చుట్టుముట్టాయి. ఇక వారి చేతిలో తన చావు తప్పదని గ్రహించిన బాగ్దాది, తప్పించుకునే మార్గమేదీ కనిపించకపోవడంతో వారికీ బంధీ కావడానికి ఇష్టపడక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శక్తిమంతమైన బాంబులతో తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు తీవ్రతకు అతని స్థావరం కూడా కుప్పకూలిపోయింది.

ఆ తరువాత అక్కడ ఉన్న శవాలని వెలికి తీసి, డీఎన్ఏ పరీక్షల అనంతరం బాగ్దాది మృతదేహాన్ని నిర్ధారించారు. ఈ విషయాన్ని పెంటగాన్ లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించారు. 15 నిమిషాల్లో డీఎన్ఏను పూర్తి చేశామని, తమకు లభించిన మృతదేహం బాగ్దాదిదేనని ధృవీకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే దాన్ని ఖననం చేసేశారు. కానీ , అయన మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేసారో చెప్పలేదు.

కానీ , ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం అతని మృతదేహాన్ని సముద్ర గర్భంలో ఖననం చేశామని అమెరికా సంయుక్త బలగాల ఛైర్మన్ జనరల్ మార్క్ మిల్లీ ప్రకటించారు. ఇదివరకు లాడెన్ మృతదేహాన్ని ఖననం చేయడానికి అనుసరించిన పద్ధతులనే తాము పాటించామని అన్నారు.  పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో 2011లో లాడెన్ ను హతమార్చిన విషయం తెలిసిందే. లాడెన్ ని కూడా ఇలాగే సముద్రంలో ఖననం చేసారు. భూగోళం మీద ఎక్కడ బాగ్దాది మృతదేహాన్ని పూడ్చి పెట్టినా క్రమంగా ఆ ప్రదేశం ఐసిస్ ఉగ్రవాదుల పుణ్యక్షేత్రంగా మారుతుంది అని గ్రహించి .. సముద్రంలో ఖననం చేసినట్టు తెలిపారు. అల్ బాగ్దాదికి చెందిన ఇద్దరు ముఖ్య అనుచరులను తాము సజీవంగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుండి ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదం ఏఏ దేశాల్లో పాకిందనే విషయాన్ని, వారి నెట్ వర్క్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఆ తరువాత దాన్ని ఎలా అంతం చేయాలో ఆలోచిస్తామని తెలిపారు.
Tags:    

Similar News