అప్పుడు కొవిషీల్డ్ కాలం.. ఇప్పుడు కొవాగ్జిన్ టైమ్

Update: 2022-04-27 02:30 GMT
కొవిడ్ వచ్చిన మొదట్లో అంటే.. రెండేళ్ల కిందట అసలు టీకా వస్తుందా..? ఆలోగా ఎన్ని ప్రాణాలు పోతాయి? బతికి బట్టకట్టడం ఎలా? అసలు టీకాకు కొవిడ్ లొంగుతుందా..? సాధారణంగా ఏదైనా వ్యాధికి టీకాలు రావడానికి కొన్నేళ్లు పడుతుంది..? అలాంటప్పుడు కొవిడ్ కూ అంతేనా? ఎన్నో అనుమానాలు.. ఇలాంటి సమయంలో ఏడాది వ్యవధిలోనే అటుఇటుగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ వచ్చాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు రూపొందించిన ఈ టీకాను భారత్ లో కొవిషీల్డ్ పేరిట సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. ఇక కొవాగ్జిన్ ను తెలుగు వారైన క్రిష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా సారథ్యంలోని భారత్ బయోటెక్ సంస్థ సొంతంగా తయారుచేసింది.

ఆ రకంగా చూస్తే కొవిషీల్డ్ .. మేడిన్ ఇండియా టీకానే. కొవాగ్జిన్ మాత్రం మేడిన్ ,మేకిన్ ఇండియా టీకా. కానీ, మార్కెట్ లోకి ప్రవేశించేందుకు కొవిషీల్డ్ కు లభించినంతగా కొవాగ్జిన్ కు మార్గం లభించలేదు. ఓ దశలో దీనిపై క్రిష్ణా ఎల్లానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన భారత టీకాకే అడ్డంకులు కల్పించారంటూ వాపోయారు. ఇక టీకా పంపిణీలోనూ దీని ప్రభావం కనిపించింది. కారణాలు ఏమున్నా కానీ..పది టీకాలు పంపిణీ అయితే.. అందులో దాదాపు 8-9 కొవిషీల్డ్ ఉండేవి. ఒకటో,రెండో కొవాగ్జిన్ ఉండేవి. తర్వాత తర్వాత పరిస్థితులు మారాయి అనుకున్నా.. అంతరం మాత్రం తగ్గలేదు.

కాలం మారింది..

తాజాగా చూస్తే కొవాగ్జిన్ కాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. 6-12 ఏళ్ల వారి కోసం కొవాగ్జిన్‌.. 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ పంపిణీకి డీసీజీఐ మంగళవారం అత్యవసర అనుమతులు జారీ చేసింది. దీంతో కార్బెవ్యాక్స్ బయోలాజికల్ - ఇ సంస్థ తయారీ. ఇది కూడా హైదరాబాదీ బేస్డ్ సంస్థనే కావడం విశేషం. కాగా, కొవాగ్జిన్‌ ను ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. దీన్ని చిన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ భారత బయోటెక్ దరఖాస్తు చేసుకుంది.

క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, సంబంధిత ఇతర వివరాలను అందజేసింది. అటు 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకా పంపిణీ కోసం బయోలాజికల్ - ఇ సంస్థ కూడా దరఖాస్తు చేసుకొంది. వీటి సమాచారాన్ని, ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ (SEC) గత గురువారం భేటీ అయ్యింది. అనంతరం 6-12 ఏళ్ల చిన్నారులకు కొవాగ్జిన్‌ టీకాను, 5-12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకాను ఇచ్చేందుకు ఎస్‌ఈసీ.. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI)కి సిఫార్సు చేసింది.

షరతులతో అనుమతి

టీకా పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతి 15 రోజులకోసారి భద్రతా డేటాను అందజేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలల పాటు నెలకోసారి ఈ వివరాలను ఇవ్వాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా.. 5 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే టీకాలకు అత్యవసర అనుమతులు లభించిన నేపథ్యంలోనే త్వరలోనే ఈ వయసు వారికి వ్యాక్సిన్‌ పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

12 ఏళ్లు పైబడిన వారికి జైకోవ్‌-డి..

12 ఏళ్లు పైబడిన పిల్లలకు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి ఇచ్చేందుకు కూడా డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం 12-18ఏళ్ల వయసు వారి కోసం రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కొవాగ్జిన్‌ ను 15 నుంచి 18 ఏళ్ల వయసువారికి పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటులోనూ ఇది అందుబాటులో ఉంది. 12-14 ఏళ్ల పిల్లలకు ఇస్తున్న కార్బెవాక్స్‌ మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లోనే ఉందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో ఈ వయసు వారికి మూడో టీకా అందుబాటులోకి వచ్చినట్లయింది.

కొవిషీల్డ్ కథేంటి..

పెద్దలకు టీకాల్లో జోరు చూపించిన కొవిషీల్డ్ పిల్లకు టీకాల్లో వెనుకబడింది. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ, జైకొవ్ డీ మధ్య పూర్తిగా రేసులోనే లేకుండా పోయింది. పిల్లలకు కొవావ్యాక్స్ పేరిట టీకా తీసుకొస్తున్నామని, ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని నవంబరులోనే సీరం సంస్థ ప్రకటించింది. కానీ, ఆ గడువు ముగిసినా స్పందన లేదు. మరోవైపు చూస్తే.. మిగతా పోటీ సంస్థలు పిల్లల టీకాకు అనుమతులు పొందాయి. ఇక తాజాగా వెల్లడైన దానిప్రకారం కొవిషీల్డ్.. ఒమైక్రాన్ వేరియంట్ పై పనిచేయదు. ఈ విషయాన్ని ప్రఖ్యాత నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) స్పష్టం చేసింది. ఇప్పుడంతా ఒమైక్రాన్ వేరియంటే. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ మార్కెట్ కు ఇది దెబ్బే. కాకపోతే ఇప్పటికే చాలామంది ఈ టీకాను పొంది ఉన్నారు. వారంతా బూస్టర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా కొవిడ్ టీకా మార్కెట్లో తొలుత ముందున్న కొవిషీల్డ్ ఇప్పుడు వెనుకబడింది.
Tags:    

Similar News