వైర‌స్ రోగుల అవ‌స్థ‌లు: టిమ్స్‌.. గాంధీలో స‌కాలంలో అంద‌ని సేవ‌లు

Update: 2020-07-12 03:30 GMT
ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారి వైర‌స్ తెలంగాణ‌ను డేంజ‌ర్ జోన్‌గా మారింది. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండ‌డంతో ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో బెడ్లు నిండిపోయాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఆస్ప‌త్రులు వైర‌స్ బాధితుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. వారికి వైద్య సేవ‌లు అందించేందుకు వైద్యులు.. వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఉన్న‌దే కొద్దిమంది... వారంతా సెల‌వులు లేకుండా ప‌ని చేస్తున్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా మార‌డంతో ఆ సిబ్బందంతా వెనుకంజ వేస్తున్నారు. రెగ్యులర్‌ ప్రాతిపదికన పని చేస్తున్న వారు మినహాయిస్తే.. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల కింద పని చేస్తున్న స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల్లో ఇప్పటికే 30 శాతం మంది చెప్పాపెట్ట‌కుండా సెల‌వులు పెడుతున్నారు. ఇప్పటికే పని చేస్తున్న వారు భయంతో విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ ఆస్ప‌త్రుల్లో వైద్య సిబ్బంది కొర‌త తీవ్రంగా ఉంది.

విష‌యం తెలిసిన ప్రభుత్వం రెగ్యులర్‌ కాకుండా తాత్కాలిక ప్రతిపాదికన నియామకాలు చేప‌డుతున్న అంత‌గా స్పంద‌న రావ‌డం లేదు. స్పెషాలిటీ వైద్యులు.. టెక్నీషియన్లు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. దీంతో గాంధీ ఆస్ప‌త్రితో పాటు.. గచ్చిబౌలిలో కొత్త‌గా ఏర్పాటుచేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(టిమ్స్‌)లో వైద్య సిబ్బంది కొర‌త ఏర్ప‌డింది. 14 అంతస్తుల్లో 1,500 పడకలతో అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన టిమ్స్ లో కూడా పరిస్థితి ఇలా ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. పది రోజుల క్రితమే సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా సిబ్బంది లేక ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.

సిబ్బంది కొర‌త‌తో ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఉస్మానియా ఆస్ప‌త్రితో పాటు బోధ‌నాస్పత్రులు, జిల్లాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌పై హైద‌రాబాద్‌కు ర‌ప్పిస్తున్నారు. వారు కూడా ప‌ని చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. గాంధీ, టిమ్స్‌, కింగ్‌కోఠి, ఛాతీ ఆస్ప‌త్రి త‌దిత‌ర ఆస్ప‌త్రుల్లో ప‌ని చేసేందుకు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియమాకానికి ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనికి నామ‌మాత్ర‌పు స్పంద‌న వ‌చ్చింది. చివ‌ర‌కు 152 మంది రాగా వారిలో చాలామందిని గాంధీ ఆస్ప‌త్రికి కేటాయించారు. వారు కొన్నాళ్లు ప‌ని చేసి వారు కూడా భ‌యాందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రాణాంత‌క వ్యాధిగ్ర‌స్తుల‌కు తాము సేవ‌లు అందిస్తున్నామ‌ని... ఈ క్ర‌మంలో తాము కూడా వైర‌స్ బారిన ప‌డ‌తామేన‌నే ఉద్దేశంతో వారు విధులకు రావ‌డం లేదు. ఈ విధంగా తెలంగాణ‌లోని వైర‌స్ ఆస్ప‌త్రుల‌కు వైద్య సిబ్బంది కొర‌త తీవ్రంగా ఉంది. అందుకే రోగుల‌కు స‌కాలంలో వైద్య సేవ‌లు అంద‌డం లేదు.
Tags:    

Similar News