అభ్యర్థి లేడు గాని పోటీకి రెడీ అంట !

Update: 2022-04-23 10:30 GMT
తొందరలో జరగబోయే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేయటానికి బీజేపీ డిసైడ్ చేసింది. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్లే ఆత్మకూరులో కూడా బీజేపీ పోటీచేస్తుందని పార్టీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు. పార్టీలో ఇపుడున్న నేతల్లో ఎవరైనా లేదా కొత్తగా చేరాలని అనుకుంటున్న వారిలో ఎవరైనా సరే పోటీచేసే అవకాశముందన్నారు. అంటే వీర్రాజు చేసిన ప్రకటన ప్రకారం ఇప్పటివరకు అభ్యర్ధి లేరన్న విషయం అర్ధమైపోతోంది.

ఆత్మకూరులో ఎంఎల్ఏగా తర్వాత మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ మేకపాటి గౌతమ్ సోదరుడు మేకపాటి విక్రమ్ పోటీచేయటం దాదాపు ఖాయమైంది.

గౌతమ్ స్ధానంలో ఎవరు పోటీచేయాలన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మేకపాటి కుటుంబానికే వదిలేశారు. దాంతో కుటుంబం మాట్లాడుకుని గౌతమ్ సోదరుడు విక్రమ్ పోటీ చేయబోతున్నట్లు మేకపాటి ఫ్యామిలీ ప్రకటించింది.

ఎలాగూ మేకపాటి కుటుంబంలో నుండి పోటీ చేస్తారు కాబట్టి గెలుపు చాలా తేలికే. ఉపఎన్నికలో పోటీచేయాలా వద్దా అన్న విషయమై ఇప్పటివరకు టీడీపీ ప్రకటించలేదు. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు.

మరి ఆత్మకూరు ఉపఎన్నికలో ఏమి చేస్తుందో తెలీదు. ఇంతలో బీజేపీ మాత్రం ముందుగానే పోటీ చేస్తామని ప్రకటించేసింది. విచిత్రం ఏమిటంటే పోటీకి రెడీ అయిపోయిన పార్టీకి అభ్యర్ధి మాత్రం లేరు.

అందుకనే పార్టీలో ఇపుడున్న వారు ఎవరైనా పోటీకి వస్తే లేదా కొత్తగా చేరబోయే వ్యక్తులు పోటీకి రెడీ అయినా సరే అంటు వీర్రాజు ప్రకటించింది. అంటే ఇపుడున్న నేతలు పోటీకి రెడీగా లేరని తెలిసిపోతోంది.

అలాగే ఓటమి ఖాయమని తేలిపోయిన ఎన్నికల్లో పార్టీలో కొత్తగా చేరబోయే వ్యక్తులు ఎవరు ముందుకొస్తారు ? పార్టీలో నేతలే పోటీకి దూరంగా ఉన్నపుడు కొత్తగా చేరబోయే వారు ఎవరు ముందుకొస్తారో వీర్రాజుకే తెలియాలి. సరే గెలుపు లాంఛనమే అయిపోయిన ఎన్నికలో ప్రతిపక్షాల్లో ఏ పార్టీ పోటీచేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు.
Tags:    

Similar News