గుడ్డిగా గూగుల్ మ్యాప్‌పై ఆధార‌ప‌డితే బుక్క‌వ్వాల్సిందేనా!

Update: 2022-08-12 07:48 GMT
గ‌తంలో ఎక్క‌డికైనా వెళ్లాలంటే.. చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చేది. దారులు వెతుక్కుంటూ, అడ్ర‌స్ లు క‌నుక్కుంటూ వెళ్లాల్సి వ‌చ్చేది. అయితే గూగుల్ మ్యాప్స్ వ‌చ్చాకా ఇలాంటి క‌ష్టాలన్నీ తొల‌గిపోయాయి. ఎవ‌రినీ అడ‌గాల్సిన ప‌నే లేకుండా.. ఖ‌చ్చిత‌మైన పాయింట్‌కి వెళ్లిపోతున్నారు. చ‌దువురాని వారు సైతం గూగుల్ మ్యాప్స్ ద్వారా తాము వెళ్లాల‌నుకున్న లొకేష‌న్ ఫిక్స్ చేసుకుని అత్యంత సులువుగా వెళ్లిపోతున్నారు.

అయితే.. గూగుల్ మ్యాప్స్ అత్యంత ఖ‌చ్చిత‌త్వంతో ఉంటాయ‌నుకుంటే పొర‌పాటే అనే విష‌యం తాజాగా స్ప‌ష్ట‌మైంది. గూగుల్ మ్యాప్స్ ను న‌మ్ముకుని ఓ కుటుంబం అడ్డంగా బుక్కైపోయింది. అది ఎక్క‌డో అనుకునేరు.. మ‌న‌దేశంలోనే కేర‌ళ‌లో ఓ కుటుంబం ఇలాగే గూగుల్ మ్యాప్స్ ను న‌మ్ముకుని దారి త‌ప్పిపోయింది.

తాజాగా కేరళలో జరిగిన ఘ‌ట‌న‌ బయటకు రావడంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ కుటుంబంలోని నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. వారు గూగుల్ మ్యాప్స్‌ని పెట్టుకుని తాము వెళ్లాల‌నుకుంటున్న దారిలో వెళ్తున్నారు.

గూగుల్ మ్యాప్స్ లో చూపించిన‌ట్టే వెళ్లారు. అయినా స‌రే దారి తప్పి కారు కాలువలో పడిపోయింది. దీన్ని గమనించిన స్థానిక ప్రజలు తక్షణమే స్పందించి కాలువలో పడిన కారులోని మనుషులను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో వారికి ప్రాణాపాయం త‌ప్పింది.

తిరువతుక్కల్‌-నట్టకోమ్‌ సిమెంట్‌ జంక్షన్‌ బైపాస్‌ మీదుగా కుటుంబం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అయితే గూగుల్ మ్యాప్ ని ఫాలో అయినా.. ఒక్కోసారి అది ఏ రూట్ లో తీసుకెళ్తుందో గమనించుకోవాలంటూ ఈ ఇన్సిడెంట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

గూగుల్ మ్యాప్ ఖ‌చ్చిత‌మైన నిర్ధార‌ణ ఏమీ కాద‌ని.. అందులోనూ కొన్ని త‌ప్పులున్నాయ‌ని చెబుతున్నారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్ ని ఫాలో అయిపోతే చిక్కుకుపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.
Tags:    

Similar News