ఆ నలుగురు.... ఎటువైపు...

Update: 2019-01-05 05:11 GMT
విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక, పర్యాటక రాజధాని. ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖద్వారం. పల్లెటూరులా కనిపించే పట్టణం. ఇన్ని లక్షణాలు ఉన్న ఈ పట్టణంలోను, జిల్లాలోనూ రాజకీయాలు ఎప్పుడు రసకందాయమే. ఒకే పార్టీలో ఐదారు గ్రూపులు. ఒకే పార్టీలో ఎత్తులు, పైఎత్తులు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ఏ పట్టణం, నగరంలోనూ ఉండదని రాజకీయ పరిశీలకులు అంటారు. అంతే కాదు... ఎవరు రాజు అవుతారో... ఎవరు హఠాత్తుగా పకీరవుతారో కూడా తేలనిది విశాఖపట్నంలోనే. సరే, ఇంతకీ అసలు విషయం ఏమిటంటే విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. వీరిలో ఒకరు జాతీయ పార్టీకి చెందిన శాసనసభ్యుడే అయినా... ఆయన మాత్రం ఆ పార్టీలో కొన్నాళ్లుగా చురుకుగా లేరు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.  వారే కొణతాల రామక్రిష్ఱ, సబ్బం హరి, దాడి వీరభ్రదం, భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు. వీరంతా రాజకీయాల్లో ఉద్దండులు అని పేరు తెచ్చుకున్న వారే.
 
వీరిలో ఒక్క విష్ణుకుమార్ రాజు మాత్రమే బిజేపి ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన నలుగురు గత కొంత కాలంగా రాజకీయ నిరుద్యోగులుగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల కినుక వహించిన విష్ణుకుమార్ రాజు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారంటున్నారు.
ఇక మిగిలిన వారిలో కొణతాల రామక్రిష్ణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆ తర్వాత ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత కొన్నాళ్లకు బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ లేరు. ఆయన తన రాజకీయ పునహప్రవేశాన్ని ఏ పార్టీతో ప్రారంభిస్తారో త్వరలో తెలియజేస్తానంటున్నారు. ఇక దాడి వీరభద్రరావు కూడా తెలుగుదేశం నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఈయన కూడా ఏదో ఒక పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక మాజీ మేయర్ సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో ఈ నలుగురు నాయకులకు కీలకమైన క్యాడర్ ఉంది. రాజకీయంగా మంచి అనుభవం కూడా ఉంది. ఈ క్యాడర్, అనుభవం ఏ పార్టీకి ఉపయోగపడుతుందో అని జిల్లా వాసులే కాదు... ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. వీరిలో విష్ణుకుమార్ రాజు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే అంటున్నారు. కొణతాల, దాడి ఇద్దరూ జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీరి రాజకీయ  పునహప్రవేశంతో జిల్లా రాజకీయాలు వాడిగా వేడిగా మారనున్నాయి.




Full View
Tags:    

Similar News