వైజాగ్ స్టీల్స్ పై ఇన్ని అబద్ధాలా ?

Update: 2022-03-29 05:30 GMT
'అందరితో చర్చించాకే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది' ఇది తాజాగా లోక్ సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ చేసిన ప్రకటన.  వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం ఎవరెవరితో మాట్లాడింది ? ఎవరెవరితో అంటే నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సంప్రదింపులు జరిపినట్లు మంత్రి చెప్పటమే విచిత్రంగా ఉంది.

 ఏ ఫ్యాక్టరీని అయినా ప్రైవేటీకరించాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా మాట్లాడాల్సింది ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో. నీతి అయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మాట్లాడితే వాస్తవ ఆర్ధిక పరిస్థితిని వివరిస్తారు. కార్మికులు, ఉద్యోగులతో మాట్లాడితే ఆర్ధిక పరిస్థితి బాగు చేయటానికి, సంస్ధను లాభాల్లోకి తీసుకురావటానికి ఎలాంటి పద్ధతులు అవలంభించాలో సూచిస్తారు.

 వీటన్నింటికీ అదనంగా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చించాలి. కేంద్రంలోని గనులు, ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రిత్వ శాఖతో మాట్లాడితే బాగుంటుంది. అంతేకానీ కేంద్రమే నియమించిన నీతిఅయోగ్ తో మాట్లాడినట్లు మంత్రి చెప్పటంలో ఎలాంటి ఉపయోగముండదు.

ముందుగానే ప్రధానమంత్రి ఆలోచనలు తెలుసుకున్న నీతి ఆయోగ్ అయినా ఇతర మంత్రిత్వ శాఖలు ప్రైవేటీకరణ వద్దని చెప్పేంత ధైర్యం చేస్తాయా ? వైజాగ్ స్టీల్స్ కు ఇప్పటికీ సొంత గనులను ఎందుకని కేటాయించలేదో కేంద్రం చెప్పటంలేదు.

సొంత గనులు లేకపోవటం వల్లే అత్యధిక ధరలు పెట్టి ఇనుప ఖనిజాలను కొనాల్సి రావటమే ఫ్యాక్టరీ ఆర్థికంగా ఇబ్బందులకు మూల కారణమని అందరు మొత్తుకుంటున్నారు. అయినా కేంద్రం ఈ దిశగా ఆలోచించటం లేదు. ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేబదులు తమకు అప్పగించమని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా నరేంద్ర మోడీ సర్కార్ పట్టించుకోవటంలేదు.

ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారితో మాట్లాడకుండా ఏ మాత్రం సంబంధం లేని శాఖలతో మాట్లాడితే ఏమిటి ఉపయోగం ఉంటుందో అర్థం కావటంలేదు. ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్న మోడీ ప్రభుత్వం దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఇన్ని అబద్ధాలు చెబుతోంది.
Tags:    

Similar News