సీఎం టు ఓట‌ర్లు.. మ‌ధ్య‌లో వాళ్లు.. ఎమ్మెల్యేలు చేతులు పిసుక్కోవ‌డ‌మే!

Update: 2022-04-20 08:31 GMT
ఓ ఎమ్మెల్యే అధికార కార్యాల‌యం అంటే.. త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించుకునేందుకు, వివిధ ప్రభుత్వ ప‌థ‌కాలకు ద‌ర‌ఖాస్తులు అందించేందుకు వ‌చ్చే పోయే ప్ర‌జ‌ల‌తో ఎప్పుడూ సంద‌డిగా ఉంటుంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఆ ప‌రిస్థితే లేదు. అక్క‌డ ప్ర‌జ‌లంతా ఇప్పుడు గుంపులు క‌ట్టేది గ్రామ వాలంటీర్ ద‌గ్గ‌రే. అవును అదే నిజం.. ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే కూడా గ్రామ వాలంటీర్ల‌కే అధిక ప్రాధాన్య‌త ఉంద‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అందుకు కార‌ణం సీఎం జ‌గ‌న్ అన‌డంలో సందేహం లేదు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను అమ‌ల్లోకి తెచ్చిన జ‌గ‌న్‌.. సీఎం టు ప్ర‌జ‌లు వ‌యా వాలంటీర్లు అనేలా పాల‌న కొన‌సాగిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

అన్నింటికీ వాలంటీర్లే..

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక సంక్షేమ ప‌థ‌కాల‌పై అధిక దృష్టి సారించారు. న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌జ‌ల కోసం ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. మ‌రి ఈ పథ‌కాల కోసం ప్ర‌జ‌లు త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల‌న్నా.. స‌మ‌స్య‌లు విన్న‌వించుకోవాల‌న్నా.. ప‌థ‌కాలు స‌రిగ్గా అందుతున్నాయో లేదో ప‌రిశీలించాల‌న్నా.. అన్నింటికీ గ్రామ వాలంటీరే క‌నిపిస్తున్నారు. ఇటు ప‌వ‌ర్ లేక అటు నిధులు లేక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్స‌వ విగ్ర‌హాల్లా మారార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌భుత్వ పథ‌కాలు అమ‌లులో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిద్దామ‌నుకుంటే అందుకు వాలంటీర్లు ఉన్నారు.. ఇక త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేద్దామంటే అందుకు నిధులు లేవు. చివ‌ర‌కు ఒక వీధి దీపం కూడా ఏర్పాటు చేయించ‌లేని ప‌రిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు ఒక ప్రోటోకాల్ త‌ప్ప ఏం ద‌క్క‌డం లేదు. సంక్షేమ ప‌థ‌కాల ప్రారంభోత్స‌వాల్లోనూ వాళ్లు కేవ‌లం గెస్టులుగా మాత్ర‌మే మారిపోయారు. దీంతో ఇప్పుడు వాళ్లు  ఏం చేయాలో తెలీక చేతులు పిసుక్కుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ ఆలోచ‌న‌..

ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం ఉండాల‌నేది సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే సీఎం టు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే టు ఎంపీపీ, ఎంపీపీ టు స‌ర్పంచ్ అనే విధానానికి ఆయ‌న ముగింపు ప‌లికార‌ని అంటున్నారు. అలా ఇంత‌మందిని దాటుకుంటూ సంక్షేమ ప‌థ‌కాలు వెళ్లేస‌రికి అర్హుల‌కు ఫ‌లితాలు అందవ‌ని సీఎం అనుకుంటున్నార‌ని టాక్‌. అందుకే నేరుగా వాలంటీర్ల ద్వారా ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు.

వాలంటీర్ల‌కు ప్ర‌భుత్వం నెల‌కు రూ.5 వేలే చెల్లిస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో మాత్రం వాళ్ల ప‌లుకుబ‌డి పెరిగిపోయింది. ప్ర‌తి ప‌నికి వాళ్ల ద‌గ్గ‌రకే ప్ర‌జ‌లు వెళ్తున్నారు. ఇక 90 శాతం వాలంటీర్లు మెరుగ్గా ప‌ని చేస్తున్నార‌ని జ‌గ‌న్‌కు ఓ నివేదిక అందింది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు, గ్రామ నాయ‌కుల ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు క‌న‌బ‌డ‌డం లేదు. అయితే ఎన్నిక‌ల నాటికి నాయ‌కులతో మాట్లాడ‌దామ‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ని టాక్‌.

ఇక మే 1 నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కు సంక్షేమ ప‌థ‌కాలు అనే కార్య‌క్ర‌మం ద్వారా జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల వివ‌రాలు నేరుగా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసే కార్య‌క్ర‌మం షురూ చేయ‌బోతున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతుందని విశ్లేష‌కులు అంటున్నారు. ఎమ్మెల్యేల‌ను చూసి కాదు సీఎంను చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేయాల‌నేది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను మార్చినా జ‌గ‌న్ అనే పేరుతో విజ‌యం సాధించాల‌నేది సీఎం వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యాన్ని అర్థం చేసుకుని ఎమ్మెల్యేలు కూడా జ‌గ‌న్ భ‌జ‌న చేయాల‌న్న‌ది హైక‌మాండ్ ప‌రోక్షంగా చెబుతున్న వాస్త‌వ‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
Tags:    

Similar News