మోడీకి అసలైన మిత్రులు వారేనట... హ్యాట్రిక్ పీఎం ధీమా అందుకే...?

Update: 2023-01-20 23:30 GMT
కేంద్రంలో మూడవసారి బీజేపీ వరసగా అధికారంలోకి వస్తుందా అన్నది ఇపుడు అతి పెద్ద చర్చ. మోడీకి ఈ రోజుకీ ధీటైన ప్రధానమంత్రి అభ్యర్ధి దేశంలో లేకపోవడం అనుకూలించే పరిణామం. అలాగే బీజేపీ వ్యూహాలకు సరితూగే ఎత్తులను వేసే నైపుణ్యం కూడా విపక్ష కూటమిలో కరవు అవుతోంది. మరో పదహారు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. అయినా కానీ దేశంలో మోడీ వ్యతిరేక రాజకీయం బలంగా ముందుకు రావడంలేదు.

ఎక్కడికక్కడ ఎవరికి వారు మీటింగులు పెట్టి మోడీ మీద నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని రేసులో తామంటే తాము అని పోటీ పడుతున్నారు తప్ప నిర్మాణాత్మకమైన పంధాలో మాత్రం మోడీని ఎదిరించే రాజకీయం మాత్రం దేశంలో ఇప్పటికీ రూపు కట్టకపోవడం బీజేపీకి అతి పెద్ద రాజకీయ అడ్వాంటేజ్ గా మారబోతోంది. అయితే రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి బీజేపీకి యాంటీ ఇంకెంబెన్సీ అయితే ఉంటుంది. దాని వల్ల గతసారి కంటే సీట్లు దక్కవచ్చేమో కానీ మరో  మారు బీజేపీ పవర్ లోకి రావడం ఖాయమనే అంటున్నారు.

ఈ మాటను కాంగ్రెస్ కి చెందిన కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ కూడా చెప్పడం జరిగింది. బీజేపీకి మెజారిటీకి సీట్లు తగ్గవచ్చేమో కానీ అతి పెద్ద పార్టీగా కమలమే ఉంటుంది అని జోస్యం చెప్పేశారు. ఇక బీజేపీకి 2019లో అయితే 303 సీట్లు దక్కాయి. ఎన్డీయే మిత్రులతో కలుపుకుని ఆ సంఖ్య మరింతంగా పెరిగింది. అయితే అప్పటికీ ఇప్పటికీ మిత్రులను బీజేపీ కోల్పోవడం వల్ల రేపటి ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది అని అంటున్నారు.

ఇక 350 సీట్లు సాధించాలి అన్న బిగ్ టార్గెట్ తో 2024 ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. మరోసారి పూర్తి మెజారిటీతోనే తమకు పాలనను అప్పగిస్తారు అని బీజేపీ విశ్వసిస్తోంది. ఒక వేళ ఏ మాత్రం సీట్లు తగ్గినా ప్లాన్ బీ కూడా బీజేపీ వద్ద సిద్ధంగా ఉంది అంటున్నారు. దాని కోసం నమ్మదగిన మిత్రులను ఆ పార్టీ ఇప్పటికే రెడీ చేసి పెట్టుకుంది అని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోమారు మోడీ ప్రధాని కావడానికి సీట్లు తగ్గినా నలుగురు మిత్రులు కచ్చితంగా సాయం చేస్తారు అని అంటున్నారు. ఆ మిత్రులలో మొదటి వారు ఒడిషా సీఎం బిజూ  జనతాదళ్ అధినేత, సీఎం నవీన్ పట్నాయక్ అంటున్నారు. 21 ఎంపీ సీట్లు ఉన్న ఒడిషాలో మెజారిటీ సీట్లు ఎపుడూ బిజూ జనతాదళ్ కే వస్తున్నాయి. దాంతో నవీన్ మోడీకి మంచి మిత్రుడిగా కాపు కాస్తారట.

అలాగే యూపీ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి కూడా మోడీకి జై కొడతారు అని అంటున్నారు. గతసారి అయిదు ఎంపీ సీట్లు బీఎస్పీకి వచ్చాయి. ఆ సంఖ్య పెరిగినా తగ్గినా కూడా వచ్చే సీట్లతో బీజేపీకి మోడీకి జై కొడతారు అని నమ్మకంగా ఉన్నారుట. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద కూడా మోడీకి బీజేపీకి కడు నమ్మకం అంటున్నారు.

ఏపీలో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఈసారి ఎంత లేదనుకున్నా వైసీపీకి 15 కంటే ఎక్కువే ఎంపీ సీట్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి. దాంతో బీజేపీ ఇబ్బందికరంగా ఉన్న నేపధ్యంలో ఆ సీట్లను వైసీపీ మద్దతుగా ఇస్తుందని అంటున్నారు. చివరిగా ఎవరూ ఊహించని మద్దతే బీజేపీకి మోడీకి దక్కబోతోంది అంటున్నారు. ఆమె ఎవరో కాదు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అని అంటున్నారు. ఆమె గత కొంతకాలంగా కేంద్రంతో సానుకూలంగా ఉంటూ వస్తున్నారు.

అలా పశ్చిమ బెంగాల్ లో 42 ఎంపీ సీట్లు ఉంటే అందులో మెజారిటీ సీట్లు మమత గెలుచుకున్నా చివరి నిముషంలో బీజేపీ కోసం ఉపయోగిస్తారు అని లెక్కలేసుకుంటున్నారు. అంటే ఈ నాలుగు పార్టీలు కనీసంగా యాభై సీట్ల దాకా బీజేపీకి సాయం చేసినా మూడవసారి మళ్లీ కేంద్రంలో మోడీ సర్కార్ ఏర్పడుతుంది అని లెక్కలేసుకుంటున్నారుట.  ఏది ఏమైనా బీజేపీ ఎవరి మద్దతు తీసుకోకుండానే 350 సీట్లు సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది అని అంటున్నారు. చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News