ఓట్ల కోసం వైసీపీ వాళ్లు.. కాంట్రాక్టు ప‌నులు మాత్రం టీడీపీ వాళ్ల‌కు.. ఇదో చిత్రం గురూ!

Update: 2021-04-04 04:30 GMT
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి సుమారు 22 నెల‌లు పూర్త‌వుతోంది. ఈ క్ర‌మంలో పార్టీలో అంద‌రూ హ్యాపీగానే ఉన్నారా? పార్టీ కోసం .. పార్టీ అధినేత జ‌గ‌న్‌ను సీఎం పీఠం ఎక్కించేందుకు కృషి చేసిన కార్య‌క‌ర్త‌లు ఫుల్లు ఖుషీతోనే ఉన్నారా? అంటే.. లేర‌నే అంటున్నారు కార్య‌క‌ర్త‌లు. పార్టీ త‌మ‌ను వాడుకుని వ‌దిలేస్తోంద‌ని చెబుతున్నారు. త‌మ‌ను అవ‌కాశ‌వాదంగా చూస్తున్నార‌ని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్ల కోసం పార్టీ అధిష్టానం త‌మ‌ను బాగానే వాడుకుంద‌ని.. కానీ, ప్ర‌భుత్వం త‌ర‌ఫున త‌మ‌కు ఎలాంటి ఆద‌ర‌ణ ఉండ‌డం లేద‌ని వాపోతున్నారు.

మ‌రీ ముఖ్యంగా మా ప్ర‌భుత్వం వ‌చ్చింది.. మాకు అంతో ఇంతో ప‌నులు ద‌క్కుతాయి.. ఓ ప‌దిరూపాయ‌లు సంపాయించుకుం దాం.. అనుకున్నామ‌ని.. కానీ, ఆవిధ‌మైన ప‌రిస్థితి లేద‌ని కార్య‌కర్త‌లు ల‌బోదిబోమంటున్నారు. ఓట్ల‌కోసం త‌మ‌ను వాడుకుంటు న్న పార్టీ.. కాంట్రాక్టు ప‌నులు, డ‌బ్బులు వ‌చ్చే ప‌నులు మాత్రం ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల‌కు అప్ప‌గిస్తూ.. త‌మ‌ను రోడ్డున ప‌డేస్తు న్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, చోటా నేత‌ల‌కు ప‌నులు ఇస్తే.. క‌మీష‌న్ ఇవ్వ‌రని.. అదే టీడీపీ వాళ్ల‌యితే.. అడిగినంత క‌మీష‌న్ ఇస్తార‌నే ఉద్దేశంతో టీడీపీ నేత‌ల‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని వారికే కాంట్రాక్టు ప‌నులు అప్ప‌గిస్తున్నార‌ని.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఇదే విష‌యం వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇందులోనూ మ‌రో తిర‌కాసు ఉంద‌ని చెబుతున్నారు. పెద్ద పెద్ద ప‌నుల‌కు వైసీపీ వాళ్లే కాంట్రాక్టులు వేయించి.. ద‌క్కించుకుంటున్నారు. పెట్టుబ‌డి మాత్రం టీడీపీ అగ్ర నాయ‌కుల కాంట్రాక్టుల‌తో క‌లిపి వేస్తున్నారని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రామాయ‌ప‌ట్నం పోర్టులో దాదాపు రూ.2500 కోట్ల ప‌నుల‌ను ఈనాడు అధినేత రామోజీరావు వియ్యంకుడుకు చెందిన ఓ సంస్థ‌కు ఇచ్చారంట‌. అది కూడా వైసీపీ అగ్ర‌నేత అల్లుడితో క‌లిపి ప‌నులు అప్ప‌గించారు. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. మైకు ప‌ట్టుకున్నా.. మీడియా ముందుకు వ‌చ్చినా.. టీడీపీ నేత‌ల‌ను ఈనాడును తిట్టిపోస్తుంటారు వైసీపీ నాయ‌కులు.

కానీ, ప‌నుల విష‌యానికి వ‌స్తే.. మాత్రం వాళ్ల‌కే ఇస్తున్నారు. దీంతో వైసీపీ స‌ర్కారులో అందునా.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఏరికోరి జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని త‌పించిన స‌ర్కారులో ఇప్పుడు వారు ల‌బోదిబో మ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇదే ప‌రిస్థితి మ‌రో రెండేళ్లు కొన‌సాగితే.. పార్టీకే పెద్ద‌దెబ్బ అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అలాకాకుండా.. ఇప్ప‌టికైనా నాయ‌కులు మేల్కొని న్యాయం చేయాల‌ని కార్య‌క‌ర్త‌లు కోరుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News