రాజధానిలో దొంగలు పడ్డారు!

Update: 2019-07-07 17:30 GMT
ఏపీ రాజధాని అమరావతిలో దొంగలు రెచ్చిపోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం వాడుతున్న సామాగ్రిని చీకటి పడితే చాలు మాయం చేస్తున్నారు. ఎక్కడ నుంచి వస్తున్నారు ? ఎలా వస్తున్నారో తెలియడం లేదు గాని తెల్లారేసరికి అక్క‌డ సామాగ్రి మాయం అయిపోతోంది. రాజధాని నిర్మాణ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నా... సెక్యూరిటీ గార్డులు ఉన్నా కూడా దొంగలను మాత్రం తట్టుకోలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజధానిలో దొంగలు పోలీసులకే కాకుండా... ప్రభుత్వానికి కూడా సవాల్ విసురుతున్న‌ట్ల‌వుతోంది.

గత ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ పరిధిలో కోట్లాది రూపాయల పనులు జరిగాయి. మధ్యలో ఎన్నికల కోడ్ రావడంతో చాలా పనులు నిలిచిపోయాయి. ఇదే దొంగలకు వరం అయింది. ఎన్నికలకు ముందు వరకు పగలు.. రాత్రి అనే తేడా లేకుండా వేలాదిమంది కార్మికులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం ఓడిపోయి... వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు కాంట్రాక్టర్లు తాత్కాలికంగా ప‌నులు నిలిపివేశారు. మరికొందరు బిల్లుల కోసం వెయిటింగ్ లో ఉన్నారు. చాలా మంది కార్మికులు తమ సొంత‌ రాష్ట్రాలకు వెళ్లి పోయారు. దీంతో నిర్మాణ సామగ్రి మొత్తం అక్కడే ఉంది. వీటిపై కన్నేసిన దొంగలు రాత్రికి రాత్రే వీటిని మాయం చేసేస్తున్నారు.

విచిత్రం ఏంటంటే నిర్మాణం కోసం వాడుతున్న సామాగ్రితో పాటు తట్ట.. మట్టి... గునపాలు.. ఇనుము ఇలా ఏది దొరికితే దానిని తీసుకుపోతున్నారు. కొన్ని నిర్మాణాలు జరుగుతున్న చోట్ల సెక్యూరిటీ గార్డులు కాపలా ఉంటున్నా గుంపులు గుంపులుగా వస్తున్న దొంగలు వారిని బెదిరించి మరి దోపిడీకి పాల్పడుతున్నారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి - తుళ్లూరు - తాడికొండ మండలాల్లో ఈ దొంగతనాలు జోరు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టులు చేస్తోన్న వారు ఈ దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం చేతులెత్తేసే పరిస్థితి వచ్చేసింది.

కొన్నిచోట్ల గుంపులు గుంపులుగా వస్తున్న దొంగలు తాము లోకల్ అని... తమకు రాజకీయ అండదండలు ఉన్నాయని... తమను అడ్డుకోవాలని చూస్తే ఫలితం వేరుగా ఉంటుందని హెచ్చరికలుల‌కు సైతం దిగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమానం ప్రకారం వీళ్లకు స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి రాజకీయ నేతలతో పాటు కొందరు రియల్టర్లు, బడాబాబుల అండదండలు ఉన్నాయని... అందుకే వీరు ఎవరిని లెక్కచేయకుండా నిర్మాణ సామాగ్రిని భారీగా దోచుకు పోతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దొంగల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రేపు రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన నిర్మాణ పనులు జరుగుతాయి. ఇప్పట్లోనే వీళ్ల‌కు చెక్ పెట్టకపోతే రేపు వీళ్లు మ‌రింత‌గా పేట్రేగిపోతార‌న‌డంలో సందేహం లేదు.



Tags:    

Similar News