ఎమ్మెల్యేగా గెలిచినా ఆ ముచ్చట తీరలేదు

Update: 2019-05-03 04:48 GMT
తిప్పేస్వామి.. మడకశిర వైసీపీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్లు పోరాడి గెలిచారు. అసెంబ్లీలో స్పీకర్ కోడెల చేత ప్రమాణ స్వీకారం కూడా చేశాడు.కానీ తీరా అసెంబ్లీలో అధ్యక్ష అని అనలేకపోయారు. ఆ దురదృష్టవంతుడైన ఎమ్మెల్యే మరెవరో కాదు.. తిప్పేస్వామి. ఈయన అసెంబ్లీలో కాలుపెట్టకపోవడానికి పెద్ద కారణమే ఉంది.

అనంతపురం జిల్లా మడకశిరలో 2014లో టీడీపీ నుంచి ఈరన్న - వైసీపీ నుంచి తిప్పేస్వామి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 14వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. అసెంబ్లీకి వెళ్లారు. ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్లు మడకశిరను పాలించారు.అయితే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న గత అసెంబ్లీ కాలపరిమితి పూర్తికాకుండానే మాజీ అయిపోయారు. తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు. దీనంతటికి కారణం ఈరన్న ఎన్నికల అఫిడవిట్ లో తన కేసు వివరాలను పేర్కొనకపోవడమే..

ఈరన్న కేసులు దాచి ఈసీని మోసం చేశారని తిప్పేస్వామి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో నాలుగున్నరేళ్ల తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈరన్న శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది హైకోర్టు. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు ఈరన్న వెళ్లినా అదే అనర్హతను కొనసాగించింది. దీంతో నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యే అయిన ఈరన్న మాజీ ఎమ్మెల్యే అయిపోగా.. అదే నాలుగున్నరేళ్లు పోరాడి గెలిచిన తిప్పేస్వామి ఎన్నికల ముందర ఎమ్మెల్యేగా స్పీకర్ చాంబర్ లో ప్రమాణం చేశారు. కానీ ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడం.. అధ్యక్షా అని తిప్పేస్వామి ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం విశేషం. ఇలా ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీలో అడుగుపెట్టకుండా.. ఆ ముచ్చట తీర్చుకోకుండా తిప్పేస్వామి ఎమ్మెల్యే అనే ట్యాగ్ తోనే కాలం గడిపారు.

ఇప్పుడు ఎన్నికల వేళ.. తిప్పేస్వామి వైసీపీ నుంచి.. ఈరన్న మళ్లీ టీడీపీ నుంచి పోటీపడ్డారు. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈసారి మడకశిర ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News