బాబుతోనే పీకే!... ఈ వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం!

Update: 2019-03-26 10:42 GMT
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ కూట‌మికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశారు. త‌న సామాజిక ఓట‌ర్లు అధికంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ కూట‌మికి విజ‌యం చేకూర్చారు. త‌న సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు క్రియాశీల‌కంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లితాల‌ను తారుమారు చేశారు. మొత్తంగా ఈ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్‌... టీడీపీకి అధికారం చేజిక్కేలా చేశారు. అయితే ఇప్ప‌టి ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దూరం జ‌రిగారు. నేరుగా చంద్ర‌బాబు, లోకేశ్ ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ క‌ల‌క‌లం రేపారు. ఈ బంధం ముగిసిన‌ట్టేన‌ని అంతా భావించారు. అయితే ఆ భావ‌న త‌ప్ప‌ని తేలింది ఇప్పుడు. ఈ ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన‌.... టీడీపీ వెంటే సాగుతోంద‌ని చెప్పేందుకు ప‌క్కా ఆధారాలు క‌నిపిస్తున్నాయి. ఒక్క‌టొక్క‌టిగానే బ‌య‌ట‌కు వ‌స్తున్న ఈ ప‌రిణామాలు ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

విప‌క్ష పార్టీగా అధికార పార్టీపై దుమ్మెత్తిపోయ‌డానికి బ‌దులుగా ఏకంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంపైనే విరుచుకుప‌డుతున్న పీకే వైనంతోనే అనుమానాలు పుట్ట‌గా... తాజాగా ఇటు ప‌వ‌న్ తో పాటు అటు చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయ‌ని చెప్పాలి. ఈ కోణంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు సవాల్‌ విసురుతున్న పవన్‌ కళ్యాణ్‌ ను అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి- సూళ్లూరుపేట- గూడూరు- చిత్తూరు జిల్లా సత్యవేడు- ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుల్లో ఎన్నికల ప్రచారం చేసిన చంద్ర‌బాబు ఒంగోలులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్న ప‌వ‌న్ ను అభినందిస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు పేర్కొన్నారంటే... జ‌న‌సేన‌తో అవ‌గాహ‌న కుదిరిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక  ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యానికి...త‌న‌కు టీడీపీ మద్దతిస్తే అండగా ఉంటాని ప‌వ‌న్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. *జనసేనకు మద్దతు పలకండి మీకు నేను అండగా ఉంటా* అని టీడీపీ నాయకులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గ‌తంలో తాను టీడీపీకి మ‌ద్ద‌తిచ్చి, ఆ త‌ర్వాత దూరం జ‌ర‌గడానికి గ‌ల కార‌ణాల‌ను గుర్తు చేసుకున్న ప‌వ‌న్‌.. *అనుభవం పనిచేస్తుందని తెలుగుదేశం పార్టీకి గతంలో మద్దతు పలికాను. అనుభవం అభివృద్ధి చేయలేనపుడు, అనుభవం లంచగొండులుగా మారిన ఎమ్మెల్యేలను నిలువరించలేకపోయినపుడు దానిపై మాట్లాడాల్సి వచ్చింది. సీఎం పరిపాలనానుభవం రాష్ట్రానికి ఉపయోగపడనపుడు బయటకు రావాల్సి వచ్చింది* అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబుపై ఇంత సానుకూలంగా మాట్లాడిన ప‌వ‌న్‌.... అదే జ‌గ‌న్ విషయానికి వ‌చ్చేస‌రికి ఆగ్ర‌హంతో ఊగిపోయారు. కోర్టుల చుట్టూ తిరిగే జగన్‌ రాష్ట్రానికి సీఎం అయితే ప్రజల భవిష్యత్తు  అలానే అవుతుందనే భయం కలుగుతోందని ప‌వ‌న్ అన్నారు. పులివెందులలో తన కుటుంబ సభ్యుడిని హతమారిస్తే ఆ విషయంపైనే స్పష్టత లేని వ్యక్తికి రాష్ట్రంపై ఎలా స్పష్టత వస్తుందని విమర్శించారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాల్సిన ప్రతిపక్ష నేత చట్ట సభల నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. అటు చంద్ర‌బాబు, ఇటు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను చూస్తుంటే... టీడీపీ, జ‌న‌సేనల మ‌ధ్య మ‌ళ్లీ పొత్తు పొడిచిన‌ట్టేన‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

    

Tags:    

Similar News