శశికళకు ఇది భారీ షాక్

Update: 2022-04-12 04:31 GMT
తమిళనాడులో ఏఐఏడీఎంకే రాజకీయాలు కీలక మలుపు తిరిగింది. అన్నాడీఎంకే నుండి శశికళ తొలగింపు సక్రమమే అని చెన్నై హైకోర్టు తీర్పిచ్చింది. పార్టీ నుండి శశికళ(చిన్నమ్మ)ను తొలగిస్తూ పార్టీ ఏకగ్రీవంగా 2017లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని చిన్నమ్మ తాజాగా కోర్టులో చాలెంజ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలను చిన్నమ్మ చేతిలోకి తీసుకోవాలని అనుకున్నారు.

అయితే అనూహ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు ఆమెకు నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. దాంతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాల్సిన ఆమె చివరి నిముషంలో వెళ్ళి బెంగుళూరులోని జైల్లో కూర్చున్నారు.

జైలు నుండి విడుదలైన దగ్గర నుండి పార్టీ తన సొంతమని, పార్టీ నుండి తనను ఎవరు వేరే చేయలేరంటు నానా గోల చేస్తున్నారు. శశికళ జైలుకు వెళ్ళగానే ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగాను, పన్నీర్ సెల్వం పార్టీ సమన్వయకర్త గా వ్యవహరించారు.

జైలు నుండి విడుదల కాగానే పార్టీని చేతుల్లో తీసుకోవాలని చిన్నమ్మ చేస్తున్న ప్రయత్నాలను వీళ్ళద్దరు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగానే కోర్టులో కేసులు పడ్డాయి. 2017లో పార్టీ నుండి శశికళను తొలగిస్తూ పార్టీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ఆమె తొలగింపు సక్రమమే అని తాజాగా మద్రాసు హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఆమె మాత్రం కోర్టు తీర్పును అంగీకరించటం లేదు. కోర్టు తీర్పును తాను అంగీకరించేది లేదని పై కోర్టులో రివ్యూ పిటీషన్ వేస్తానని ప్రకటించారు.

మొత్తానికి శశికళ వ్యవహారం తమిళ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నది. అలాగే అన్నాడీఎంకేలోని నేతల మధ్య కూడా శశికళ విషయంలో మిశ్రమ స్పందన కనబడుతోంది. కొందరు నేతలు ఇప్పటికీ చిన్నమ్మకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళ దన్ను చూసుకునే చిన్నమ్మ రెచ్చిపోతున్నారు.

అయితే తాజాగా కోర్టిచ్చిన తీర్పుతో శశికళకు పార్టీకి సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే అనిపిస్తోంది. చిన్నమ్మ ఫై కోర్టుకు వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు. ఒకసారి పార్టీ నుండి ఆమెను బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత ఎవరు చేయగలిగేదేమీ ఉండదు.
Tags:    

Similar News