బాబుకు జ‌గ‌న్‌కు తేడా ఇదే.. సోష‌ల్ టాక్‌!!

Update: 2021-02-24 16:30 GMT
చేసింది చెప్పుకోవ‌డం.. ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం క‌ల్పించుకోవ‌డం అనేది ఏ ప్ర‌భుత్వానికైనా.. పార్టీకైనా కామ‌నే! అయితే.. ఈ విష‌యంలో ఒకింత లౌక్యం అవ‌స‌ర‌మ‌నే విష‌యం.. తాజాగా సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును బ‌ట్టి తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఆయ‌న మీడియాకు దూరంగా ఉంటార‌ని.. చెప్పింది చేస్తార‌ని.. డ‌బ్బా కొట్టుకోర‌ని.. ఇలా అనేక కామెంట్లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో మాజీ సీఎం చంద్ర‌బాబును కూడా కంపేర్ చేస్తున్నారు. చేసింది ఎంత ఉంద‌నేది ప‌క్క‌న పెడితే.. చెప్పేది మాత్రం చాలా ఎక్కువ‌.. గంట‌ల కొద్దీ తినేస్తారు.. అనే ముద్ర ఇటు పార్టీ వ‌ర్గాలు.. అటు ప్ర‌జ‌ల్లోనూ ఉండడం గ‌మ‌నార్హం. దీంతో ఇరువురు నేత‌ల మ‌ధ్య తేడా ఇదే అంటూ.. స‌రికొత్త చ‌ర్చ సాగుతోంది.

విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల యూనిట్‌ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా  1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది. ఇది.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో జ‌రిగింది. అయితే.. స‌ద‌రు రుణాల‌ను తామే మాఫీ చేస్తే బెట‌ర‌ని.. అప్ప‌ట్లోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆలోచించింది. అయితే.. దీనిని పెద్ద‌గా ప్ర‌చారంలోకి తీసుకురాలేదు. ఫ‌లితంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రియ‌ల్ బిజినెస్ చేస్తోంద‌నే వ్యాఖ్య‌లు వ‌చ్చాయి.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు.. గ‌త చంద్ర‌బాబు నిర్ణ‌యాన్నే.. అమల్లోకి పెట్టేశారు. 300 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలోని ఇళ్లలో ఉండేందుకు సిద్ధపడ్డారంటేనే ఆ లబ్ధిదారులు పేదవారని, నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక బ్యాంకు రుణం లేదు... వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎవరైనా రూ.500 చెల్లిస్తే ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్‌ఎఫ్‌టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్‌ పట్టణ పేదలకు కల్పించారు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది. వాస్త‌వానికి గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇదే దిశ‌గా ఆలోచ‌న చేశారు. కానీ, జ‌గ‌న్ సాహ‌సం చేశారు. బాబు వెన‌క్కి త‌గ్గారు.. ఇద్ద‌రి మ‌ధ్య తేడా ఇదే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News