టీయారెస్ కి ఇదే చివరి ఎన్నిక...?

Update: 2022-10-03 09:31 GMT
తెలంగాణాలో ఉప ఎన్నికల నగరా మోగింది. మునుగోడులో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. అంటే ఇప్పటికి కచ్చితంగా ముప్పయి రోజుల గడువు అన్న మాట. ఈ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు మీద దృష్టి పెట్టాయి. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక ముందు తరువాత అన్నట్లుగా టీయారెస్ రాజకీయ పాత్ర ఉండబోతోంది.

మునుగోడు ఉప ఎన్నికల నాటికి తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతోనే ఆ పార్టీ పోటీ చేయనుంది. ఈ నెల 5న విజయదశమి రోజున కేసీయార్ తన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ కొత్త పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మార్పులు చేయనున్నారు.

దాని కోసం ఒక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఈ నెల 6న కొత్త పేరుతో టీయారెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. తన వినతిని కూడా చేసుకోనున్నారు. అయితే  కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ ప్రతిపాదన వెళ్ళాక ఆ వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ రాదు. దానిక్ కచ్చితంగా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈ లోగానే మునుగోడు ఉప ఎన్నిక పూర్తి అవుతుందని అంటున్నారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్ధి టీయారెస్ పేరు మీదనే నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. అంటే ఈ ఎన్నికల వరకూ టీయారెస్ పేరు మారుమోగుతుంది అన్న మాట. ఈ ఉప ఎన్నికల తరువాత టీయారెస్ పేరు మారిపోతుంది. ఆ తరువాత వచ్చే ఏడాది తెలంగాణా అసెంబ్లీకి జరిగే సార్వత్రిక ఎన్నికలలో కొత్త పేరుతోనే టీయారెస్ పోటీ చేయాల్సి ఉంటుంది. అలాగే 2024 లోక్ సభ ఎన్నికలను ఆ పేరు తో జాతీయ స్థాయిలో ఎదుర్కోబోతున్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఇప్పటికి తేలేది ఏంటి అంటే టీయారెస్ పేరిట పోటీ చేసే చిట్ట చివరి ఎన్నికగా మునుగోడు ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది అని అంటున్నారు. ఈ ఎన్నికలే టీయారెస్ రాజకీయ జాతకాన్ని కూడా మలుపు తిప్పే ఎన్నికలు అని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News