మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌ రెడ్డి పెట్టబోతున్న కొత్త పార్టీ ఇదే!

Update: 2022-12-13 08:30 GMT
ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) పేరుతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో నిర్దేశించిన పరిమితికి మించి ఇనుప ఖనిజాన్ని తవ్వేసి వందల కోట్ల రూపాయలు ఆక్రమించినట్టు గాలి జనార్దన్‌రెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులను బెదిరించడం, లంచాలు ఇవ్వజూపడం, పన్నులు ఎగ్గొట్టడం వంటి పలు కేసుల్లో గాలి జనార్దన్‌ రెడ్డి జైలుపాలు కూడా అయ్యారు. రెండేళ్లకు పైగానే జైలులో ఉన్నారు.

గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లాతోపాటు రాయచూరు తదితర జిల్లాలను కూడా తన కనుసైగతో శాసించారు.. గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి. ఆ తర్వాత ఓఎంసీ వ్యవహారంలో గాలి జనార్దన్‌ రెడ్డి నాటి బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పోగొట్టుకుని జైలుపాలయ్యారు.

కాగా ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్న గాలి జనార్దన్‌ రెడ్డి కర్ణాటకలో కొత్త పార్టీని పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తాము ప్రస్తుతం బీజేపీ తమకు అనుకున్నంతగా న్యాయం చేయలేదనే భావనలో గాలి జనార్దన్‌ రెడ్డి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సొంత పార్టీ బీజేపీకి ఝలక్‌ ఇస్తూ ఒక కొత్త పార్టీ ఏర్పాటుకు గాలి జనార్దన్‌ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని సమాచారం. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీ ప్రారంభించేందుకు జనార్దన్‌ రెడ్డి సిద్ధమైనట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి పార్టీ ఏర్పాటుపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణను గాలి జనార్దన్‌ రెడ్డి సిద్దం చేసుకున్నటు చెబుతున్నారు.

గాలి జనార్దన్‌ రెడ్డికి ఉన్న పలుకుబడి, డబ్బుతో కర్ణాటకలో దాదాపు 20 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలరని చెప్పుకుంటున్నారు. నిజంగా గాలి జనార్దన్‌ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారా..లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంతవరకు గాలి జనార్దన్‌ రెడ్డి వైపు నుంచి కొత్త పార్టీ పై ఇంకా ఏ సమాచారం వెల్లడి కాలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News