ర‌మ‌ణ‌ను కారెక్కించుకున్న‌ది ఇందుకేనా?

Update: 2021-07-13 08:34 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ర‌మ‌ణ సైకిల్ దిగారు. అధికారికంగా కారెక్కారు. ఎందుకు సైకిల్ దిగారు అన్న‌ప్పుడు స‌హ‌జంగా క‌నిపించే స‌మాధానం తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్తు లేద‌ని. ర‌మ‌ణ సైడ్ నుంచి ఈ లాజిక్ ఓకే. కేసీఆర్ వైపు నుంచి చూసిన‌ప్పుడు మాత్రం రెండు వ్యూహాలు క‌నిపిస్తున్నాయి. ర‌మ‌ణ‌ను గులాబీ గూటికిలోకి ఆహ్వానించ‌డం ద్వారా.. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టుగా.. రెండు ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకోవాల‌ని చూస్తున్నార‌ట కేసీఆర్‌.

2018 ఎన్నిక‌ల్లో టీడీపీ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డం.. ఒక్కొక్క‌రుగా నేత‌లు ఇత‌ర పార్టీల వైపు వెళ్లిపోవ‌డంతో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతూ వ‌చ్చింది. ఎమ్మెల్యేలు, నేత‌లు స‌హా.. అంద‌రూ అవ‌కాశం ఉన్న గూటికి చేరిపోయారు. పేరున్న నేత‌ల్లో ర‌మ‌ణ మాత్ర‌మే మిగిలారు. ఇప్పుడు ఆయ‌న కూడా టీడీపీ జెండా వ‌దిలేశారు. అయితే.. పార్టీ మారినందుకు ఏంటీ లాభం అన్న‌ప్పుడు ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఆఫ‌ర్ చేశార‌నే ప్ర‌చారం సాగింది. త్వ‌ర‌లో భ‌ర్తీ కానున్న‌ ఎమ్మెల్సీల్లో ఒక‌టి ర‌మ‌ణ‌కు కేటాయించేందుకు కేసీఆర్ అంగీక‌రించార‌ని, దీంతో.. ర‌మణ కారెక్కేశార‌ని అంటున్నారు.

అయితే.. కేసీఆర్ వైపు నుంచి చూసుకున్న‌ప్పుడు రెండు ల‌క్ష్యాలు ఉన్నాయి. అందులో ఒక‌టి కూతురిని మంత్రిని చేయ‌డం, రెండోది రాబోయే ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావ‌డం. ఇందులో.. కూతురు క‌విత‌ను మంత్రిని చేస్తార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం సాగుతోంది. కానీ.. ఒకే ఇంట్లో న‌లుగురు మంత్రివ‌ర్గంలో ఉంటే.. విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిన‌ట్టు అవుతుంద‌నే భ‌యంతో ఆగార‌ని అన్నారు.

క‌విత ఎంపీగా ఓడిపోయిన త‌ర్వాత చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఆ త‌ర్వాత కూతురు మౌనాన్ని చూడ‌లేని కేసీఆర్‌.. ఎమ్మెల్సీని చేశారు. దీంతో.. మ‌ళ్లీ క‌విత మంత్రి ప‌ద‌వి అంశం తెర‌పైకి వ‌చ్చింది. ఆమెను కేబినెట్లోకి తీసుకునేందుకు ఎమ్మెల్సీని చేశార‌నే ప్ర‌చారం సాగింది. కానీ.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. తాను ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌నే మంత్రి వ‌ర్గంలోకి వ‌స్తాన‌ని, ఇలా ప‌రోక్షంగా కాద‌ని చెబుతున్నార‌ట క‌విత‌. దీంతో.. రాబోయే ఎన్నిక‌ల్లో కూతురి కోసం ఓ నియోజ‌క‌వ‌ర్గాన్ని సిద్ధం చేస్తున్నార‌ట కేసీఆర్‌. అదే జ‌గిత్యాల‌.

జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం ప్రాంతంలో ఎల్‌.ర‌మ‌ణ‌కు మంచి ప‌ట్టుంది. అక్క‌డి నుంచి ఆయ‌న ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క‌రీంన‌గ‌ర్ నుంచి ఎంపీ కూడా అయ్యారు. ఆ విధంగా.. అక్క‌డ బ‌ల‌మున్న ర‌మ‌ణ ద్వారా.. ఇప్ప‌టి నుంచే కూతురి కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేయించ‌నున్నార‌ట కేసీఆర్‌. ప్ర‌స్తుతం జ‌గిత్యా ఎమ్మెల్యేగా ఉన్న డాక్ట‌ర్ సంజ‌య్.. క‌విత బరిలోకి దిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకుంటాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించార‌ట‌. దీంతో.. కూతురి కోసం ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నార‌ట గులాబీ బాస్‌. దీంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను సైతం దృష్టిలో పెట్టుకున్నార‌ట‌.

తెలంగాణ‌లో టీడీపీకి స‌రైన నాయ‌క‌త్వం లేదుగానీ.. ఇప్ప‌టికీ కేడ‌ర్ మాత్రం ఉంది. అధ్య‌క్షుడిని పార్టీలో చేర్చుకోవ‌డం ద్వారా.. ఆ కేడ‌ర్ మొత్తాన్ని గులాబీ గూటి కింద‌కు తీసుకు రావొచ్చ‌ని కూడా కేసీఆర్ భావించారు. ఇప్ప‌టికి వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలో ఉండ‌డంతో.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌హ‌జ వ్య‌తిరేక‌త పెరుగుతుంది. పైపెచ్చు.. కాంగ్రెస్‌, బీజేపీ బ‌ల‌ప‌డుతున్నాయి. ఈ ప‌రిస్థితులు మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని చూస్తున్నారు కేసీఆర్‌. ఈ క్ర‌మంలో ఏ ఒక్క అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేరు. ఇందులో భాగంగానే ర‌మ‌ణ‌కు గులాబీ కండువా క‌ప్పారు. మ‌రి, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. ర‌మ‌ణ‌ను హుజూరాబాద్ లో ఈట‌లకు పోటీగా నిల‌బెట్టొచ్చ‌ని కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News