కాంగ్రెస్ గెలుపుపై సిద్దూ ఏమ‌న్నారో విన్నారా?

Update: 2017-03-11 08:29 GMT
పంజాబ్ ఎన్నిక‌ల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వ్య‌క్తి మాజీ క్రికెట‌ర్‌ - కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ. ఎన్నిక‌ల్లో గెలిస్తే ఆయ‌నే సీఎం కావ‌చ్చ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. కాంగ్రెస్ గెలుపు ఇక్క‌డ ఖ‌రారు అయిపోయిన నేప‌థ్యంలో సిద్దూ మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్‌ లో అహంకారం ఓడింది.. ధర్మం గెలిచిందని పరోక్షంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రివాల్ పై విమ‌ర్శ‌లు చెప్పారు. పంజాబ్ ప్రజలు ధర్మాన్ని గెలిపించినందుకు ఒక్కొక్కరికి కోట్ల కోట్ల ధన్యవాదలు చెప్పినా.. ప్రజల రుణం తీర్చుకోలేమని సిద్దూ అన్నారు.

ప్రతి కష్టంలోనూ వెన్నంటి ఉండాలని ప్ర‌జ‌లు తీర్పునిచ్చారని సిద్దూ ఈ విజ‌యాన్ని విశ్లేషించారు. 'ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు.. కనుక పార్టీలు అనే ఆలోచ‌న పెట్టుకోలేదు. అందరం కలిసి నడుద్దాం. అభివృద్ధిని సాధిద్దాం' అని సిద్దూ పిలుపునిచ్చారు. దెబ్బతిన్న పంజాబ్‌ను మళ్లీ పట్టాలెక్కిద్దామన్నారు. పంజాబ్‌ను దేశానికి ఉదాహరణగా మార్చాలని అనుకుంటున్నామని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆప్ అధినేత‌ - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పై సిద్దూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కేజ్రీవాల్ ప్రచారంలో నిజాయితీ లేదని, అందుకే ఆయ‌న ఓటమి పాలయ్యారని విశ్లేషించారు. సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ప్రచారానికి పంజాబ్ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని సిద్ధూ తెలిపారు.

"దుష్టులను ఎప్పటికైనా భగవంతుడు శిక్షిస్తాడు. నిస్వార్థంతో పోరాటం చేస్తే ఎప్పుడైనా మాదే విజయం" అని అన్నారు. ఈ విజయాన్ని సోనియా గాంధీ - రాహుల్‌ కు కానుకగా ఇస్తున్నామని చెప్పారు. విజయం కార్యకర్తలదని స్పష్టం చేశారు. '35 ఏళ్ల వయసు వరకు 25 ఏళ్లు భారత్ తరపున క్రికెట్ ఆడాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచాను. నాకు ఇంకా ఏం కావాలి? ఇప్పుడు తనకు కావాల్సిందల్లా పంజాబ్ అభివృద్ధి మాత్రమే" అని సిద్దూ స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News