క్యాన్స‌ర్ క‌ణితిని క్ష‌ణాల్లో గుర్తించే పెన్‌!

Update: 2017-09-07 13:52 GMT
ప్ర‌తి ఏటా కొన్ని వేల మందిని క‌బ‌ళిస్తున్న మ‌హ‌మ్మారి క్యాన్స‌ర్. స‌రైన స‌మ‌యంలో క్యాన్స‌ర్ కు కార‌ణ‌మైన క‌ణ‌తుల‌ను గుర్తించి తొల‌గించ‌డం ద్వారా రోగిని కాపాడే అవ‌శాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. అయితే, క్యాన్స‌ర్ బారిన ప‌డ్డ‌వారిలో ఆ క‌ణ‌తుల‌ను గుర్తిండం అనేది డాక్ట‌ర్ల‌కు పెద్ద స‌వాల్ వంటిది. స‌ర్జ‌రీ స‌మ‌యంలో ఆ క‌ణ‌తుల‌ను మ‌రింత క‌చ్చితంగా, వేగంగా గుర్తించేందుకు వీలుగా ఓ ప‌రిక‌రాన్ని వాషింగ్ట‌న్ లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ప‌రిశోధ‌కులు రూపొందించారు. సర్జరీ సమయంలో క్యాన్సర్‌ కణాన్ని గుర్తించే మాస్పెక్‌ పెన్ ను వారు త‌యారు చేశారు.

రోగుల‌లో క్యాన్స‌ర్ క‌ణ‌తులు తొల‌గించేట‌పుడు ఏ క‌ణ‌తుల‌ను ఉంచాలి, వేటిని తొల‌గించాలి అనే విష‌యాన్ని ఈ మాస్పెక్ పెన్ ద్వారా సులువుగా గుర్తించ‌వ‌చ్చు. కేవలం పది సెకన్లలోనే 96 శాతం క‌చ్చితంగా ఆ క‌ణ‌తుల‌ను ఈ పెన్ గుర్తిస్తుంది. ఇప్ప‌టికి అందుబాటులో ఉన్న సాంకేతిక ప‌రిజ్ఞానంతో పోలిస్తే ఈ పరికరం 150 రెట్లు వేగంగా పనిచేస్తుంది. క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధించి మెరుగైన చికిత్స అందించడంలో కూడా మాస్పెక్‌ పెన్ ఉప‌యోగ‌ప‌డుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌లో కొంత భాగం రోగి శ‌రీరంలో ఉండి పోతుంది. త‌ద్వారా రోగికి మ‌ళ్లీ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఈ పెన్ ద్వారా క్యాన్సర్‌ కణుతులను పూర్తిగా నిర్మూలించవ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

ఈ పెన్‌ను రోగి కణాలపై ఉంచినప్పుడు వాటిపై ఈ పెన్ నీటి బిందువును జారవిడుస్తుంది. ఈ శాంపిల్‌ ను పరికరంలో ఉండే మాస్‌ స్పెక్ట్రోమీటర్‌ గ్రహిస్తుంది. సూక్ష్మాతిసూక్ష్మమైన అణువులను కూడా ఈ స్పెక్ట్రోమీట‌ర్ ప‌రీక్షిస్తుంది. ఈ ప‌ద్ధ‌తిలో రోగికి ఎటువంటి హానీ జ‌ర‌గ‌దు. కేవ‌లం ఆ పెన్ ప్టాస్టిక్ మొన‌, నీటి బిందువు మాత్ర‌మే కణాల‌కు త‌గిలేలాగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఈ విధానం వ‌ల్ల స‌ర్జ‌రీల‌లో క‌చ్చిత‌త్వం పెరిగి, రోగికి క్యాన్స‌ర్ తిర‌గ‌బెట్టే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  ఈ పెన్ పై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌ల‌కు జ‌రిపి 2018 నుంచి స‌ర్జరీల‌లో ఉప‌యోగించాల‌ని వారు భావిస్తున్నారు.
Tags:    

Similar News