ప్రేమ గుడ్డిదనడానికి ఈ కథే నిదర్శనం

Update: 2019-06-06 06:48 GMT
ప్రేమ గుడ్డిది.. ఎడ్డిది అని ఎందరో కవులు ఎన్నో రకాలుగా చెప్పిచూశారు. కానీ ప్రేమికులు మాత్రం అది అక్షరాల అక్షర సత్యం అని నిరూపిస్తూనే ఉన్నారు. ఒకే ప్రియుడు కోసం ఇద్దరు ప్రియురాళ్లు పోటీపడడం.. అతడినే పెళ్లి చేసుకోవడం.. కలిసి కాపురం చేస్తామంటూ పోలీసులను ఎదురించడం చూశాక.. నిజంగానే ప్రేమ గుడ్డిది అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ ప్రియుడు మాత్రం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు.. వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఇద్దరినీ పెళ్లి చేసుకున్న ఈ ప్రేమికుడి కథ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

అది తమిళనాడులోని తిరుపూర్ జిల్లా దారాపురం పుదుకోట్టేమేడు గ్రామం. ఓ కత్తిలాంటి యువకుడు ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడికి భర్త చనిపోయిన 25 ఏళ్ల యువతితో పరిచయం ప్రేమగా మారింది. కానీ అదే సమయంలో అప్పటికే ఇతగాడికి 19 ఏళ్ల యంగ్ లేడీతో ప్రేమ కొనసాగింది. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు. సినిమాల్లో ట్విస్టులున్నట్టే ఇతడి జీవితంలోనూ ఈ ఇద్దరు ప్రేమల వ్యవహారం బయటపడింది.

తమను నమ్మించి మోసం చేస్తావా అంటూ ఇద్దరు ప్రియురాళ్లు ఆటోడ్రైవర్ ను నిలదీశారు. దీంతో ఇద్దరిని వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరినీ వద్దన్నాడు. దీంతో విషయం గ్రహించిన ప్రియురాళ్లు అతడిపై ప్రేమ చావక ఒక నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ ఆ ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు..

మే 29న  ఫైన్ మార్నింగ్ ఇద్దరినీ తీసుకొని పళనిలోని ఓ ఆలయానికి వెళ్లాడు ఆ ప్రియుడు. ఇద్దరి ప్రియురాళ్ల మెడలో తాళి కట్టాడు. అనంతరం కోయంబత్తూరు వెళ్లేందుకు బస్ స్టేషన్ లో నిలుచొని ఉండగా పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు. 19 ఏళ్ల యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిని , ఆ యువతిని పట్టుకెళ్లారు. అయితే పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువతి మాత్రం తనను అరెస్ట్ చేయండని పోలీస్ స్టేషన్ లో గొడవ చేసింది. ఆ ఇద్దరు యువతులు తాము కలిసే ఉంటామని.. ఆటో డ్రైవర్ ను ఏమీ చేయవద్దని.. పోలీస్ స్టేషన్ లో నానా రభస చేశారు. ఎంత నచ్చచెప్పినా ఆటోడ్రైవర్ ను వదిలేయడానికి ఒప్పుకోకపోవడంతో వాళ్ల బంధువులు, పోలీసులు ఈ జంటలను వదిలి ఇంటికి పంపించారు. ఇలా ఒకే దెబ్బకు ఇద్దరికి మొగుడుగా మారిన ఆటోడ్రైవర్ సంతోషంతో కొత్త కాపురం మొదలుపెట్టాడు.. అదృష్టం అంటే ఇతడిదేనంటున్నారు.  

    

Tags:    

Similar News