కొడాలి నానీకి... సోమిరెడ్డి ప‌రిస్థితి వ‌స్తుందా?

Update: 2021-11-26 07:32 GMT
వైసీపీ నాయ‌కుడు.. జ‌గ‌న్ స‌ర్కారులో మంత్రిగా ఉన్న కొడాలి నానికి.. నెల్లూరు జిల్లా టీడీపీ నాయ‌కుడు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితే వ‌స్తుందా? సోమిరెడ్డి ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగారు. కానీ.. ఐదు ఎన్నిక‌లుగా ఆయ‌న ఓట‌మి చ‌విచూస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు దూకుడుగా ఉన్న‌నానికి కూడా సోమిరెడ్డి గ‌తే ప‌డుతుందా? అనే చ‌ర్చ‌జ‌రుగుతోంది. ఇక‌, రాజ‌కీయ విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే..దేశంలో రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా గుర్తింపు పొందిన‌.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ఏపీలో ఉన్న కులాల రాజ‌కీయాలు.. ఏపీలో ఉన్న కులాల ఓటు బ్యాంకు.. దేశంలో ఎక్క‌డా లేదని తీర్మానించారు.

అలాగే.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి.. రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ రాజ‌కీయాల్లో ఎక్కువ‌గా.. కులాల ప్ర‌స్తావ‌నే ఉంటోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం జ‌గ‌న్ వెంట దాదాపు 90 శాతం ఉంది. అదే స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం చంద్ర‌బాబుకు 90 శాతం మ‌ద్ద‌తు ఇస్తోంది.

ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గం.. చంద్ర‌బాబుకు 90 శాతం మేర‌కు జై కొట్టింది. అయితే.. 2019 ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇదే క‌మ్మ‌లు , 35 శాతం బీసీ సామాజిక వర్గం జ‌గ‌న్‌కుఅండ‌గా నిలిచింది. అదే స‌మ‌యంలో టీడీపీకి 38 శాతం అండ‌గా ఉన్నారు. అందుకే.. జ‌గ‌న్‌కు 50 శాతం ఓట్లు.. 151 సీట్లు ల‌బించాయి.

అయితే.. ఇప్పుడు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. మ‌ళ్లీ 2014 ఎన్నిక‌ల మాదిరిగా.. ఎవ‌రి వ‌ర్గం.. వారి వారి పార్టీల‌కు అండ‌గా ఉంటుంద‌నే వాద‌న వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీగా ఉంటుంద‌ని కూడా విశ్లేష‌కులు భావిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు 6శాతం ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, టీడీపీకి అదే ఎన్నిక‌ల్లో 40 శాతం, వైసీపీకి 50 శాతం ఓట్లు వ‌చ్చాయి. సో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కు ల‌భించే ఓట్లు కీల‌కంగా మారుతాయ‌ని.. విశ్లేష‌కులు లెక్క‌లు గ‌డుతున్నారు.

ఇక‌, అస‌లు విష‌యానికి వ‌స్తే.. టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి కూడా అయిన‌.. సోమి రెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వ‌రుస‌గా 5 సార్లు ఓట‌మి చ‌విచూశారు. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిని చేశారు. నిజానికి సోమిరెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి వ‌ర్గం ఎక్కువ‌.

అదేస‌మ‌యంలో సోమిరెడ్డిపై రెడ్ల‌లో వ్య‌తిరేక‌త లేదు. అయినా.. కూడా ఆయ‌న ఓడిపోయారు. దీనికి కార‌ణం.. ఏంట‌నేది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఇక‌, ఇదే ప‌రిస్థితి కృష్ణాజిల్లా గుడివాడ‌లోనూ క‌నిపిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గుడివాడ నుంచి నాలుగుసార్లుగా మంత్రి కొడాలి నాని గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. క‌మ్మ‌+కాపు సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌గా ఉన్న ఈనియోజ‌క‌వ‌ర్గంలో ఈ రెండు సామాజిక వ‌ర్గాలు క‌లిస్తే.. నానికి క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. క‌మ్మ‌లు ఈ సారి టీడీపీకి అండ‌గా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక‌, కాపులు ఎలానూ.. ప‌వ‌న్‌కు అండ‌గా ఉంటారు. పైగా.. నాని కూడా టీడీపీని తీవ్రంగా విమ‌ర్శించ‌డం.. చంద్ర‌బాబుపై బూతులు మాట్లాడ‌డం.. ప‌వ‌న్‌ను విమర్శించ‌డం.. స‌టైర్లు వేయ‌డం వంటివి వారికి న‌చ్చ‌డం లేదు. సో.. ఈ రెండు సామాజిక వ‌ర్గాలు ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంటే.. గుడివాడ‌లో కొడాలికి ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News