ముంబయి పోలీసులు పోస్టు చేసిన ఈ వైరల్ వీడియో నీతి మామూలుగా ఉండదు

Update: 2021-07-12 03:11 GMT
ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. పలు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతున్న ఈ వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెనుకా ముందు చూసుకోకుండా.. అహంకారంతో పోలీసుల మీద చెలరేగిపోయే తత్త్వంతో వచ్చి పడే ఇబ్బందులు ఎంతలా ఉంటాయన్న విషయం తాజా వీడియోను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటివరకు నాణెనికి ఒకవైపు మాత్రమే చూసే నెటిజన్లకు.. రెండో వైపు ఎలా ఉంటుందన్న విషయాన్ని పరిచయం చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అహంకారంతోనో.. పవర్ ఉందన్న బలుపుతోనో.. తాము చేసిన తప్పుల్ని వదిలేసి.. ఎదుటివారు తప్పుల్ని ఎత్తి చూపే వైనం.. పలువురికి గుణపాఠంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులపై చెలరేగిపోయే బడా బాబులు.. పోలీసుల ట్రీట్ మెంట్ తర్వాత వారి తీరు ఎలా ఉంటుందన్న రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని మీరా రోడ్డు వద్ద ఒక వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా నో పార్కింగ్ జోన్ వద్ద కారును పార్కు చేశాడు. దీంతో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. ఆ కారును అక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో అక్కడకు చేరుకున్న కారు యజమాని.. అతడి పక్కనే ఉన్న మరో మహిళ నోటికి పని చెప్పటం షురూ చేశారు. పోలీసుల్ని ఇష్టారాజ్యంగా దూషిస్తూ.. ఇలా ఎలా చేస్తారు? కారుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అంటూ రెచ్చిపోయారే తప్పించి.. తాము కారును నో పార్కింగ్ జోన్ లో ఉంచామన్న విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా పోలీసుల్ని తిట్టటమే కాదు.. యూనిఫారమ్ తీసి వస్తే.. తాట తీస్తానంటూ రెచ్చిపోయాడు. ఇతగాడి మాటల్ని ఓపికగా భరించిన పోలీసులు.. తమ పని తాము చేసుకుంటూ పోయారు. అతగాడి వెంట ఉన్న మహిళ సైతం యువకుడికి ధీటుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం వీడియోలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.

రోడ్డు మీద సీన్  తొలుత వైరల్ కాగా.. అనంతరం ముంబయి పోలీసులు మరో వీడియోను షేర్ చేశారు. అందులో పోలీసుల మీద రెచ్చిపోయిన యువకుడు.. పోలీస్ స్టేషన్ లో ఒక మూలన కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు మరింత షాక్ ను ఇవ్వటంఖాయం. ఇంతకీ అతన్ని పోలీస్ స్టేషన్  కు ఎందుకు తీసుకొచ్చారు? అన్న ప్రశ్నకు ముంబయి పోలీసులు వివరణ ఇస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా వ్యవహరించిన సదరు యువకుడు ముఖానికి మాస్కు లేకపోవటంతో.. అతడిపై  కొవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. దీంతో  వీరిద్దరిపై రెండు రకాల కేసుల్ని నమోదు చేశారు.

అనంతరం అతడిని పోలీస్ స్టేఫన్ కు తీసుకొచ్చి తమదైన స్టైల్ లో ట్రీట్ మెంట్ తో ఒక మూలన కూర్చోబెట్టారు. అతడిపై పలు కేసులు నమోదు చేశారు. దీంతో తెలివి తెచ్చుకున్న సదరు యువకుడు స్టేషన్ లో ఒక మూలన కూర్చొని భోరున విపలించసాగాడు. రోడ్డుపై రెచ్చిపోయిన సదరు వ్యక్తి.. స్టేషన్ కు వచ్చేసరికి ఇలా డీలా పడిపోవటమా? అని పలువురు విస్మయానికి గురయ్యే పరిస్థితి. అనుకుంటాం కానీ నోరు మంచిదైతే.. ఊరు మంచిదన్న విషయాన్ని మర్చిపోవటం.. చేసిన తప్పును గుర్తించకుండా నోరు పారేసుకోవటం లాంటివి అనవసరమైన సమస్యల్ని తెచ్చి పెడతాయన్న దానికి నిదర్శనంగా తాజా వీడియో నిలుస్తుందని చెప్పాలి. ఈ వీడియో వైరల్ కావటమే కాదు.. అతగాడి తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. వ్యంగ్య వ్యాఖ్యలతో స్పందిస్తున్నారు.





Full ViewFull View
Tags:    

Similar News