తోపుదుర్తి వ‌ర్సెస్ ప‌రిటాల‌.. మ‌రింత రోడ్డున ప‌డ్డ రాజ‌కీయం

Update: 2022-01-19 00:30 GMT
అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ప‌రిటాల కుటుంబానికి ప్ర‌త్యేకత ఉంది. వ‌రుస విజ‌యాల‌తో పాటు.. స్థానికంగా కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించిన కుటుంబంగా పేరుంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం.. సుదీర్ఘ కాలంగా శ‌త్రుత్వం ఉన్న తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి విజ‌యం వంటివి.. అటు ప‌రిటాల‌, ఇటు తోపుదుర్తిల మ‌ధ్య మ‌రింత ర‌గిలిపోయేలా చేస్తున్నాయి. స‌మ‌యం సంద‌ర్భం అనే మాట కూడా లేకుండా..ఈ  రెండు వ‌ర్గాలు.. మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో రాప్తాడు నుంచి అనూహ్య విజ‌యం ద‌క్కించుకున్న తోపుదుర్తిపై పైచేయి సాధించేందుకు ప‌రిటాల సునీత‌, ఆమె కుమారుడు శ్రీరాం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, కొన్ని ద‌శాబ్దాలుగా.. ప‌రిటాల కుటుంబం పెంచుకున్న ఇమేజ్‌ను డ్యామేజీ చేసి.. త‌న స‌త్తా నిరూపించుకునేందుకు తోపుదుర్తి.. ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మైన రాజ‌కీయాలు.. ఇప్పుడు వ్య‌క్తిగ‌త ఆస్తులు.. వివాదాల వ‌ర‌కు సాగింది. ప్ర‌స్తుతం నువ్వెంత అంటే.. నువ్వెంత అనే మాట‌పోయి.. నువ్వు వంద‌ల కోట్ల రూపాయ‌లు ఎలా సంపాయించావో.. తెలుసు అంటూ.. ప‌రిటాల సునీత‌.. మీ ఆస్తులు ఎలా పుట్టాయో.. నాకు తెలుసు అంటూ.. తోపుదుర్తి.. ఒక‌రిపై ఒక‌రు ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల ముందుగానే.. క‌త్తులు నూరుకుంటున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా డైరీ ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బు వసూళ్లు చేశారని..ఇప్పుడు ఆ డబ్బును ప్రకాష్ రెడ్డి సోదరులు రియల్ ఎస్టేట్ కు మళ్లిస్తున్నారని ఇటీవ‌ల సునీత‌ ఆరోపించారు. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ పరిటాల కుటుంబంపై వార్ ప్రారంభించారు. పరిటాల ఆస్తి పాస్తులపై మాట‌ల తూటాలు పేల్చ‌డం ప్రారంభించారు.

ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాల పేరుతో కొండల్లో ఉన్న వారికి(ప‌రిటాల ర‌వి గురించి) ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురంలలో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. మాకు సొంత ఇల్లు లేదని ఎగతాళి చేస్తారా.. మరి మీకు ఎక్కడి నుంచి అన్నిఆస్తులు వచ్చాయో చెప్పండి అంటూ ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు ప్రశ్నించారు. మేము ఏదో సంపాదించుకున్నాం అంటున్నారు కదా.. అవి ఏవో చూపించండి ప్రజలకు పంచేస్తాం.. మేము కూడా మీ ఆస్తులు చూపిస్తాం అవి పంచే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇటు ప్రకాష్ రెడ్డి కూడా సేమ్ డైలాగ్.. ఎన్నికల అఫడవిట్ లో ఎంతో ఆస్తి చూపించారు.. మీకు వాస్తవంగా ఉన్నవి ఎంతో లెక్కలు తీయండని సవాల్ విసిరారు.

 మరోవైపు డ్వాక్రా మహిళల భాగస్వమ్యంతో ఏర్పాటు చేస్తున్న డైరీలో అక్రమాలు జరిగాయంటున్నారు… అందులో ఒక్క రూపాయి మేము కానీ అందులో సభ్యులు కానీ పక్కదారి పట్టించి ఉంటే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించలేకపోతే మీరు రాజీనామాలు చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హత్యలు, దౌర్జన్యాలతో దోచుకోవడం దాచుకోవడం అనే విధానంతో పరిటాల రవి జీవించారని.. ఇప్పుడు మీరు మీకుటుంబసభ్యులు అదే పనిలో ఉన్నారని ప్రకాష్ రెడ్డి కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పరిటాల శ్రీరామ్ ఒక జూనియర్ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. నేను కొందరు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్నానని అంటున్నారు.. నేను కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ముందు నా గురించి మాట్లాడే ముందు.. అసలు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తేల్చుకోండని కామెంట్ చేశారు. మీరు వ్యాపారాలు చేసుకొని పైకి వచ్చామంటున్నారు.. మరి విప్లవాలు, పోరాటాలని ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ తో నేను 20 ఏళ్లుగా నడుస్తున్నాని.. ఆయన వెంటే జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు.

మరోవైపు మీ తల్లిగారు సివిల్ స్ప్లైస్ మంత్రిగా పని చేశారని.. ఇప్పటికీ సివిల్ సప్లైస్ లో మీ పెత్తనం సాగుతోందని ప‌రోక్షంగా ప‌రిటాల సునీత‌పై విరుచుకుప‌డ్డారు. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో ఇక నుంచి వరుసగా రిలీజ్ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే ప్రకాష రెడ్డి. తాజాగా అనంతపురం, రాప్తాడు చుట్ట పక్కల జరిగిన భారీ భూ కుంభకోణాల చిట్టా బయట పెట్టారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో భూములు ఎలా కాజేశారో చూడండి అంటూ కొన్ని సర్వే నెంబర్లతో సహా వివరించారు. ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ చట్టాల ద్వారా వీటిని చట్ట రూపంలోకి మార్చారని ఆరోపించారు. ఇందులో కొందరు రెవెన్యూ అధికారులు సహకారం అందిందని.. గతంలో ఇక్కడ పని చేసిన కలెక్టర్ల ఎలా సహకరించారో త్వరలోనే చెబుతానని ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు చీటర్స్ వెళ్లినా స్టేలు వచ్చేస్తున్నాయని ప్ర‌కాష్‌రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వారు చేసే అక్రమాలకు ఇప్పటికీ నా పేరు వాడుకుంటున్నార న్నారు. ఇలా ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి.. ఆ తర్వాత నాక్ కాల్ చేయండని ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా.. ఇరు ప‌క్షాల వారు రెచ్చిపోయి వ్యాఖ్య‌లు చేసుకోవ‌డంతో రాప్తాడు రాజ‌కీయం.. రోడ్డున ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చివ‌ర‌కు ఇవి ఎక్క‌డ ఆగుతాయో చూడాలి.
Tags:    

Similar News