గ్రేటర్ ఎన్నికల్లో అత్యంత కీలకం ఆ 2 రోజులు..

Update: 2020-11-26 23:30 GMT
రోజులు గడుస్తున్న కొద్దీ గ్రేటర్ లో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవటం కనిపించింది. అందుకు భిన్నంగా గడిచిన రెండు రోజులుగా సీన్ మొత్తం మారిపోయింది. పొలిటికల్ హీట్ భారీగా పెంచేలా మాటలుతూటాల్లా పేలుతున్నాయి. పాతబస్తీలో అక్రమంగా ఉన్న పాకిస్తానీయులు.. రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహిస్తామంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలతో సీన్ మొత్తం మారిపోయింది. దీనికి అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించటం.. మరింత ఘాటుగా ఎన్టీఆర్.. పీవీ ఘాట్లను కూల్చేయాలని డిమాండ్ చేశారు.

దీంతో.. వాతావరణం మొత్తం మారిపోయింది. ఇలాంటివేళ.. ఇష్యూ మరింత కాంప్లికేటెడ్ కాకుండా ఉండేలా మంత్రి కేటీఆర్.. బండిసంజయ్.. అక్బరుద్దీన్ లను పిచ్చోళ్లు అంటూ తేల్చేయటం తెలిసిందే. ఈ రోజు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. బీజేపీకి అంతకంతకూ పెరుగుతున్న ఆదరణ.. టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఇలాంటివేళ.. ఈ నెల 28న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా తమ ప్రత్యర్థి పార్టీలపై ఘాటు విమర్శలు చేయటం ఖాయం. అంతేకాదు..టీఆర్ఎస్ సంగతి చూస్తామంటూ మజ్లిస్ తమను ఉద్దేశించి మాట అనేస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తన టార్గెట్ మొత్తం బీజేపీకే పరిమితం చేస్తారా? మజ్లిస్ పైనా విమర్శలు గుప్పిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. కచ్ఛితంగా బీజేపీ పై సీఎం కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉందంటున్నారు.

అయితే.. కేసీఆర్ బహిరంగ సభ జరిగిన తర్వాతి రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ నగరానికి రానున్నారు. ప్రధాని మోదీ నవంబర్ 29న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇప్పుడున్న హీట్ మీద ఆయనేం మాట్లాడతారన్నది ఉత్కంటగా మారింది. కేంద్రంపైనా.. ప్రధాని మోడీ పైనా అదే పనిగా విమర్శలు చేస్తున్న వేళ.. తన ప్రసంగంలో కేసీఆర్ ను టార్గెట్ చేయటంతో పాటు.. తెలంగాణ విషయంలో తామేం చేశామన్న విషయాల్ని చెప్పటం ఖాయం. అదే సమయంలో.. ఓవైసీ సోదరుల మీద ఆయన ఏం వ్యాఖ్యలుచేస్తారన్నది కూడా కీలకం కానుంది.మొత్తంగా చెప్పాలంటే.. ఇప్పుడెన్ని పరిణామాలు చోటు చేసుకున్నా.. ఈ నెల28.. 29లలో జరిగే సభలు.. ఆ సందర్భంగా కీలక నేతలు చేసే ప్రసంచాలు పోలింగ్ మీద ప్రభావం చూపటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News