దాయాది మామిడిపండ్లను తీసుకోవటానికీ ఆ దేశాలు ఇష్టపడటం లేదు

Update: 2021-06-13 08:37 GMT
స్నేహపూర్వక రాయబారాలు పలు రకాలుగా ఉంటాయి. ఫ్రెండ్లీగా పంపిన వస్తువుల్ని రిజెక్టు చేయటం చాలా వరకు ఉండదు. కానీ.. మామిడిపండ్లతో బిస్కెట్ వేసే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది.  స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా మామిడి పండ్లతో పలు దేశాధినేతల మనసు దోచాలనుకున్న పాక్ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది.

ప్రతి ఏటా మామిడి పండ్లను పలు దేశాలకు పాక్ పంపుతూ ఉంటుంది. ఆ మాటకు వస్తే కొన్నేళ్ల క్రితం మాజీ ప్రధాని వాజ్ పేయ్ కు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మొదలు ప్రధాని మోడీకి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాకు మామిడి పండ్లను పంపారు. తాజాగా మాత్రం 32 దేశాలకు మామిడి పండ్లను బహుమతిగా పంపింది.

అయితే.. ఇలా పంపిన దేశాల్లో కొన్ని దేశాలు మాత్రం.. దాయాది పంపిన మామిడి పండ్లను తాము తీసుకోలేమని తేల్చేయటం గమనార్హం.అలా రిజెక్టు చేసిన దేశాల్లో అమెరికా.. చైనా.. కెనడా.. నేపాల్.. ఈజిప్ట్.. శ్రీలంక దేశాలు ఉన్నట్లుగా చెబుతున్నా. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. పాక్ తో జిగిరీ రిలేషన్ మొయింటైన్ చేసే చైనా కూడా నో చెప్పటమా? అన్న సందేహానికి.. కరోనా కారణమన్న సమాధానాన్ని చెబుతున్నారు.

పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వీ తరఫున ఈ మామిడిపండ్ల బహుమతిని పంపగా.. తాము తీసుకోలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ తిప్పి పంపిన వైనం దాయాదికి దెబ్బగా చెబుతున్నారు. అయినా.. కరోనా వేళ ఆయా దేశాలకు ఇలాంటి బహుమతులు పంపాలా? వద్దా? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పంపి ఉంటే.. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News