ఆరేళ్లుగా అదే స్థానాల్లో ఐఏఎస్ లు

Update: 2021-12-13 23:30 GMT
సాధారణంగా ప్రతీ మూడేళ్లకోసారి ఐఏఎస్ లకు బదిలీలుంటాయి. కొన్ని సార్లు అవసరాలను బట్టి కాస్తు ముందూ, వెనుక అవుతుంటుంది. కానీ, తెలంగాణలో మాత్రం మూడేళ్లు దాటినప్పటికీ చాలామంది ఐఏఎస్ లు బదిలీకాకుండా పాతుకుపోయారు. ఇక, మరికొందరైతే ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతూ.......ఉన్నారు. కొంతకాలంగా ఈ విషయం తెలంగాణ అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

తెలంగాణ కేడర్ లో మొత్తం 150మంది ఐఏఎస్ అధికారులున్నారు. వారిలో కొందరు కేంద్రంలోని కీలక పోస్టుల్లో ఉంటే..మరికొందరేమో రాష్ట్రంలోని కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే, ప్రభుత్వంతో సఖ్యతగా లేని కొందరు ఐఏఎస్ లు లూప్ లైన్ లోనే, అనామక పోస్టుల్లోనో కొనసాగుతుండగా...సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్ వంటి వారు సీఎంవోలో 2014 నుంచి చక్రం తిప్పుతున్నారన్న చర్చ జరుగుతోంది.

మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా 2015 నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి, సింగరేణి కోలరీస్ ఎండీ శ్రీధర్, కో ఆపరేటివ్ శాఖ కమిషర్ వీర బ్రహ్మయ్య, ఆర్థిక శాఖలో రామకృష్ణారావు 2015నుంచి కొనసాగుతున్నారు. వీరితో పాటు శైలజా రమా అయ్యర్, బుర్రా వెంకటేశం వంటి వారు ఆ పోస్టుల్లో ఆరేళ్లుగా కొనసాగతుండడపై అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు.

అరవింద్ కుమార్, సవ్యసాచి ఘోష్, అర్విందర్ సింగ్, అలుగు వర్షిణి, నవీన్ మిట్టల్ లు గత ఆరేళ్లుగా లూప్ లో ఉండడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. వీరంతా తగిన ప్రాధాన్యతగలిగిన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, తెలంగాణలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ నెల 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుతో ఎన్నికల కోడ్‌ ముగియగానే బదిలీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఏడాదిగా బదిలీల జాబితాలు సిద్ధమవుతున్నా.. వివిధ ఎన్నికలు, ఇతర కారణాలతో బదిలీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ సారి బదిలీలు తప్పవని, జాబితా ఆల్రెడీ సీఎంవోకు చేరిందని తెలుస్తోంది. మరి, ఈ నేపథ్యంలో ఎవరెవరికి స్థాన చలనం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News