ఆ ఆరు సీట్లు.. కేసీఆర్ ఇస్తాడా? కత్తి వేలాడేదెవరికి?

Update: 2023-01-15 00:30 GMT
తెలంగాణ కామ్రేడ్లకు కంచుకోట ఖమ్మం జిల్లా.  తెలంగాణ తొలి దశ ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు  ఈ జిల్లాలో ఎర్రజెండా నేతల ప్రభావమే ఎక్కువగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా వైరాలో సీపీఎం గెలిచింది. ఆ తరువాత రాను రాను ఇతర పార్టీలు గెలుస్తున్నాయి.  అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తరువాత ఆ పార్టీ తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. దాదాపు ఈ జిల్లాలోని మొత్తం సీట్లలో పాగా వేసేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ మొన్నటి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కామ్రేడ్లతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఖమ్మంలోని కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నప్రాంతాల్లో సీట్లు కోరితే  అక్కడున్న బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటీ..? అన్న చర్చ సాగుతోంది. ఒకవేళ కమ్యూనిస్టులు అడిగిన సీట్లకు కేసీఆర్ కమిట్ అయితే  జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలకు మైనస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 స్థానాలున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. అయితే వైరా స్వతంత్ర అభ్యర్తి రాములు నాయక్, ఇద్దరు టీడీపీ, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సీట్లు ఎనిమిదికి చేరాయి. వచ్చే ఎన్నికల్లో వీటితోపాటు మిగతా రెండు నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ఎగరవేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇక్కడ సభను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఈ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టులతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయానికి కమ్యూనిస్టులు తోడయ్యారని ఆ తరువాత చర్చ సాగింది కూడా. అయితే ఈ సాయం చేసినందుకు కమ్యూనిస్టులు వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు కోరే అవకాశం ఉంది. గతంలో వామ పక్షాలకు ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే ఖమ్మంలో ఆరు సీట్లలో గెలిచే అవకాశం ఉందని నమ్ముతున్నారు. పొత్తులో భాగంగా ఆ ఆరు సీట్లను కమ్యూనిస్టులు కోరనున్నారు.

ఒకవేళ వారి కోరికకు కేసీఆర్ సై అంటే అక్కడి బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తాను పోటీ చేయడం ఖాయమని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆయనపట్టుబడితే ఈ నియోజకవర్గంలోని తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. అలాగే మధిర, భద్రాచలం నియోజకవర్గాలు కూడా కమ్యూనిస్టులు కోరే అవకాశం ఉంది. వారికి ఈ సీట్లు కేటాయిస్తే మధిర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జడ్పచైర్మన్ లింగాల కమల్ రాజు, బొమ్మెర రామ్యూర్తి, భద్రాచలం నుంచి తెల్ల వెంటకట్రావు నాయకులు పరిస్థితి ఆందోళన కరంగా మారనుంది.

కొత్తగూడెం, ఇల్లందు, వైరా నియోజకవర్గాల్లో సీపీఎం ప్రభావం ఎక్కువగానే ఉంది. అయితే ఈ నియోజకవర్గాల్లోని వనమా వెంకటేశ్వర్ రావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియలకు నష్టం చేకూరే ప్రమాదం ఉంది. ఖమ్మం ఎంపీ స్థానం నుంచి నారాయణ పోటీ చేశారు. మరోసారి అదే చేస్తే బీఆర్ఎస్ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఉంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎంల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News