రైల్వేస్ : ఆ మరకల్ని తొలగించడానికి అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తోందట !

Update: 2021-10-12 10:10 GMT
మన దేశంలో అతిపెద్ద ప్రజారవాణా సంస్థ ఏది అంటే అది ఇండియన్‌ రైల్వేస్. భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికి కూడా మెరుగైన రవాణా వ్యవస్థ అని చెప్పొచ్చు. అయితే కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వస్తోంది. వారి అలవాట్ల కారణంగా రైల్వే వ్యవస్థకు ప్రతియేడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అసలు విషయం ఏంటంటే చాలామంది రైలు ప్రయాణం చేసే సమయంలో రైళ్లల్లో పాన్‌లు, గుట్కాలు, పొగాకు నమిలి ఉమ్మి వేయడం వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో మరకలు పడటం సర్వసాధారణంగా మారింది.

ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. పాన్‌ పరాగ్‌, గుట్కా(నిషేధం ఉన్నా కూడా), తంబాకు.. ఉమ్మి మరకల్ని, సిగరెట్‌ గుర్తులను పొగొట్టేందుకు సాలీనా 1,200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది భారతీయ రైల్వే శాఖ.  అదనంగా శుభ్రం చేయడం కోసం గాలన్ల గాలన్ల నీటిని ఉపయోగించాల్సి వస్తోంది. బహిరంగంగా ఉమ్మేయడం చాలామందికి అలవాటుగా ఉన్నా.. కొందరికి ఇదంతా ఇబ్బంది కలిగించే అంశం.  ‘దయచేసి నన్ను వాడండి’.. అని రాసి ఉండే డస్ట్‌బిన్‌లను, మట్టి డబ్బాలను ఉపయోగించకుండా..  ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం చూస్తుంటాం. శుభ్రతకు సంబంధించిన ఈ అంశంపై ప్రత్యేకించి గైడ్‌లైన్స్‌ లేకపోవడం, కఠిన చర్యలు లేకపోవడంతో గుట్కా బాబులు పద్దతి మార్చుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా కరోనా టైం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా.. నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంతకాలం విజ్ఞప్తులు-హెచ్చరిక బోర్డులు, ఛలానా వార్నింగ్‌ నోటీసులతో సరిపెట్టిన రైల్వే శాఖ.. తాజాగా వినూత్న ఆలోచనకు దిగింది. గ్రీన్‌ ఇన్నొవేషన్‌ లో భాగంగా రీయూజబుల్‌, బయోడెగ్రేడబుల్‌ స్పిట్టూన్‌ ను తీసుకొచ్చింది. పాకెట్‌ సైజులో ఉండే జీ స్పిట్టూన్‌ ను డిస్పోజ్‌ చేసినప్పుడు మొక్కలు మొలుస్తాయి. దేశవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్‌ లలో ఐదు నుంచి పది రూపాయల ధరకు ఈ పాకెట్‌ సైజ్‌ డబ్బాల్ని అందిస్తున్నారు.  ఎజైస్పిట్‌ అనే స్టార్టప్‌ పశ్చిమ, నార్తర్న్‌, సెంట్రల్‌ రైల్వే జోన్‌ లలో కాంట్రాక్ట్‌ తీసుకుంది.

ఈ క్రమంలో పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వేలకు చెందిన 42 స్టేషన్లలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ. నాగ్‌పూర్‌ కు చెందిన ఈజీస్పిట్‌ అనే స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది రైల్వే శాఖ. ఈ ఒప్పందం ప్రకారం వెస్టర్న్, నార్తర్న్, సెంట్రల్ రైల్వే వ్యవస్థలకు చెందిన మొత్తం 42 రైల్వే స్టేషన్లలో వెండింగ్ మెషీన్ల వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రూ.5 నుంచి రూ.10కు ఒక పౌచ్ అమ్మనున్నారు. ప్రయాణికులు వీటిని కొనుక్కోవాల్సి ఉంటుంది. జేబులో పెట్టుకోవాలి. అందులోనే ఉమ్మాలి. వీటిలో కనీసం 10-15 సార్లు ఉమ్మివేయొచ్చు. అలాగే ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవు. పౌచ్ లో ఉమ్మాక, ఆ ఉమ్మి నుంచి బ్యాక్టీరియా బయటకు రాకుండా టెక్నాలజీ వాడారు. ఉమ్మి ఘన పదార్థంగా మారుతుంది. దాన్ని బయటపడేస్తే పౌచ్ లోని గింజలు ఉమ్మిలోని పోషకాలను వినియోగించుకుని మొక్కలుగా పెరుగుతాయ్.
Tags:    

Similar News