ఈసారి మోడీ సన్నిహితుడు బుక్ అయ్యారు

Update: 2016-04-24 04:34 GMT
గతంలో ఎప్పుడూ లేనంత దారుణమైన నీటి ఎద్దడి పరిస్థితి నెలకొంది. తాగేందుకు గుక్కెడు నీళ్ల కోసం పలు రాష్టాల్లో ఇబ్బందులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో నీటి వినియోగం మీద శ్రద్ధను చూపటంతో పాటు.. అనవసరంగా వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల మీద నిత్యం మాట్లాడే నేతలు.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం మామూలే. నిజానికి ఇలాంటి వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం చాలానే సీరియస్ అవుతారు. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది.

ఓపక్క నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే.. మరోపక్క దుమ్ము రేగకుండా ఉండటానికి వేలాది లీటర్ల నీటిని వృధా చేయటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నీటిని పొదుపుగా వాడే ప్రయత్నంలో ఎవరికి వారు తమకు తోచిన రీతిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ.. ప్రముఖులు మాత్రం అందుకు  భిన్నంగా వ్యవహరించటం తెలిసిందే. తమ పర్యటనల్లో భాగంగా హెలికాఫ్టర్లలో ప్రయాణిస్తున్న ముఖ్యనేతలు.. హెలికాఫ్టర్ దిగే సమయంలో దుమ్ము రేగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున నీటిని చల్లటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఇలాంటి ఇష్యూలలో ఇప్పటికే పలువురు ప్రముఖులు అడ్డంగా బుక్ అయ్యారు. వారికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా రావటం.. వారిపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నా.. నేతలకు ఇదేమీ చెవికి ఎక్కటం లేదన్న విషయం తాజా పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్.. హర్యానా ముఖ్యమంత్రులు ఆ జాబితాలో ఉన్నారు.

తాజాగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు.. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా ఇదే తరహా విమర్శల్లో చిక్కుకున్నారు. తాజాగా అమిత్ షా హర్యానా రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దిగేందుకు వీలుగా.. అక్కడ దుమ్ము రేగకుండా ఉండేందుకు ఆరు ట్రక్కుల నీటిని వినియోగించటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన ప్రయాణించిన భివండిలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. నీటి ఎద్దడిని తీర్చలేని నేతలు.. కనీసం నీటి వృధా అయినా అరికడితే బాగుంటుంది కదా? ఇలాంటి కనీస ఆలోచన కూడా  వారికెందుకు రాదు..?
Tags:    

Similar News