ద‌క్షిణాఫ్రికా మూడు రాజ‌ధానులు..అస‌లు క‌థ ఏంటో తెలుసా?

Update: 2019-12-19 01:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసనసభలో రాజధానిపై స్పందిస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. దక్షిణాఫ్రికా తరహాలో ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించ‌డం కొత్త చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు తెర‌లేపింది. అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని, దీంతోపాటుగా - విశాఖలో మౌలిక వసతులు ఉన్నందున అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ - జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలు నగరాన్ని గుర్తించే అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో స‌హ‌జం గానే - ద‌క్షిణాఫ్రికా ఫార్ములాపై స‌ర్వత్ర ఆస‌క్తి నెల‌కొంది.

ఆఫ్రికా ఖండంలోని ముఖ్య‌మైన దేశాల్లో ఒక‌టైన దక్షిణాఫ్రికాలో అన్ని ప్రాంతాల మధ్య అధికార పంపిణీ జరగాలనే ఉద్దేశంతో పాటుగా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల శాసన రాజధానిగా కేప్ టౌన్, పరిపాలనా రాజధానిగా ప్రిటోరియా -  న్యాయ రాజధానిగా బ్లూమ్‌ ఫౌంటెయిన్ ఉన్నాయి. ఇలా మూడు రాజ‌ధానులు ఉండ‌టం వెనుక ప్ర‌ధాన కార‌ణం ద‌క్షిణాఫ్రికా దేశం ఏర్ప‌డిన తీరు.  బ్రిటిష్ - డచ్ - జర్మనీలకు చెందిన వారు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భూభాగంలో ప‌రిపాలించేవారు. స‌హ‌జంగానే బ్రిటిష్ వారికి ఉండే రాజ్య‌కాంక్ష వ‌ల్ల జ‌రిగిన యుద్ధాల‌తో డచ్ - జర్మనీలకు చెందిన వారి ఏలుబ‌డిలో ఉన్న బోయ‌ర్ ప్రాంతం ఆంగ్లేయుల ప‌రిధిలోకి వెళ్లింది. అనంత‌రం వివిధ ప్ర‌క్రియ‌ల్లో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా పేరుతో దేశం ఏర్పాటైంది.

అయితే, రాజ‌ధాని విష‌యంలో మ‌ళ్లీ పేచీ ఏర్ప‌డింది. దీంతో చర్చలు జ‌రిగాయి. బ్రిటిష్ కేప్ ప్రావిన్స్ రాజధానిగా కేప్ టౌన్ - బోయర్ రిపబ్లిక్ ఆఫ్ ట్రాన్స్ వాల్ రాజధానిగా ప్రిటోరియా - ఆరెంజ్ ఫ్రీ స్టేట్ అనే మరో బోయర్ రిపబ్లిక్ రాజ‌ధానిగా బ్లూమ్ ఫౌంటెన్ నిర్ణ‌యించారు. ఆనాటి నుంచి నేటి వ‌రకూ ఈ మూడు నగరాలనూ రాజధానులుగా కొనసాగిస్తూ వచ్చారు. ఆసియా వెలుపల భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలో ప‌లుమార్లు ఒకే రాజ‌ధాని అంశం తెర‌ మీద‌కు వ‌చ్చింది. అయితే, స్థానిక తెగలు - రాజ‌కీయ పార్టీల డిమాండ్ల నేప‌థ్యంలో..మూడు రాజ‌ధానుల‌ను య‌థావిధిగా కొన‌సాగిస్తున్నారు.
 
   

Tags:    

Similar News