ఉత్తరాంధ్ర ఫుల్లు హ్యాపీయేనా ?

Update: 2021-11-10 12:30 GMT
జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ గనుక ఫలిస్తే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు ఫుల్లు హ్యాపీయేనా ? అవుననే అనుకోవాలి తాజా పరిణామాలను చూసిన తర్వాత. ఏపీ-ఒడిషా రాష్ట్రాల సరిహద్దు గ్రామాలు, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాజెక్టుల విషయంలో దశాబ్దాల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి జగన్ చొరవ చూపించారు. తొందరలోనే విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేయాలని జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే దశాబ్దాల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత విశాఖకు మూవ్ అవ్వాలని జగన్ అనుకున్నట్లున్నారు. ఇందులో భాగంగానే జగన్ చొరవ తీసుకుని ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగానే పట్నాయక్ కూడా సానుకూలంగా స్పందించటంతో మంగళవారం మధ్యాహ్నం పట్నాయక్ తో భేటీ అయ్యారు. వీరి భేటీలో పోలవరం, నేరడి బ్యారేజి, జంఝావతి ప్రాజెక్టు, బలిమెల, ఎగువ సీలేరు విద్యుత్ కేంద్రం, కొఠియా సరిహద్దు గ్రామాల వివాదంపై ఇద్దరు సీఎంల మధ్య చర్చలు జరిగాయి.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిస్సాలో కూడా కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి. అలాగే జంఝావతి, నేరడి, బలిమెల ప్రాజెక్టులకు సాంకేతిక సమస్యలతో పాటు ముంపు సమస్య కూడా ఉంది. మావోయిస్టుల సమస్య, గంజాయి నియంత్రణకు కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యింది. నిజానికి ఇవన్నీ దశాబ్దాలుగా అపరిష్కృతంగానే ఉన్నాయి. తాజాగా సీఎంలిద్దరి సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో కమిటి వేయాలని డిసైడ్ అయ్యంది. ఇద్దరు సీఎస్ లు గనుక ఒకటికి పదిసార్లు సమావేశమైతే సమస్యల పరిష్కారానికి ముందడుగులు పడినట్లే అనుకోవాలి.

ఇక రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కొఠియా పేరుతో పాపులరైన 18 గ్రామాలున్నాయి. ఇవన్నీ కూడా అవటానికి ఒడిస్సా గ్రామాలే అయినా వీటిని ఆ ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. ఇదే సమయంలో వాళ్ళందరికీ ఏపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రేషన్ కార్డులు, ఓటరు కార్డులు కూడా ఏపి పరిధిలోనే ఉన్నాయి. అందుకే తమ గ్రామాలను ఏపిలోనే కలపాలని గ్రామస్తులు సంవత్సరాలుగా డిమాండ్లు చేస్తున్నారు. దీనికి ఒడిస్సా ప్రభుత్వం అంగీకరించటంలేదు.

ఇదే విషయమై సరిహద్దుల్లో గొడవలవుతున్నాయి. గ్రామాల్లో జనాభి అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకోవాలని సీఎంల సమావేశంలో నిర్ణయమైంది. ఇలాంటి సమస్యలు పరిష్కారమైతే ఉత్తరాంధ్ర ఫుల్లు హ్యాపీనే అనుకోవాలి. సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు సమావేశమవ్వటమే శుభపరిణామంగా చూడాలి. ఎందుకంటే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం కాని సమస్యలుండవు కదా.


Tags:    

Similar News