బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో 3 పాజిటివ్ కేసులు

Update: 2020-03-26 10:51 GMT
కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా.. పాజిటివ్ కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. అంతో ఇంతో ఉపశమనం కలిగించే అంశం.. కేసుల సంఖ్య ఎక్కువగా లేకపోవటం. గడిచిన మూడు రోజులతో పోలిస్తే.. ఈ రోజు (గురువారం) మధ్యాహ్న్ సమయానికి తెలంగాణరాష్ట్రంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు హైదరాబాద్ మహానగరానికి చెందినవే కావటం గమనార్హం.

బుధవారం తక్కువ కేసులు నమోదు కావటం.. అనుమానితుల సంఖ్య సైతం తగ్గటంతో ఊపిరి పీల్చుకున్న అధికారులకు.. ఈ రోజుపాజిటివ్ కేసులు నమోదు కావటం ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా వెల్లడైన మూడు పాజిటివ్ కేసుల్ని చూసినప్పుడు.. ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. తాజాగా పాజిటివ్ గా తేలిన మూడు కేసుల్లో రెండు ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలవి కాగా.. వారిద్దరూ వైద్యులే కావటం గమనార్హం. మరొకరు నగర శివారుకు చెందిన వారు. అయితే.. సదరు వ్యక్తికి ఎలాంటి ఫారిన్ ట్రావెల్ హిస్టరీ లేకపోవటం ఆందోళనను కలిగించే అంశం.

తాజాగా ప్రకటించిన మూడు పాజిటివ్ కేసులతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ ల సంఖ్య 44కు చేరుకున్నట్లైంది. దోమలగూడకు చెందిన 43 ఏళ్ల వైద్యుడికి.. అతడి సతీమణి 36 ఏళ్ల వైద్యురాలికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. వీరిద్దరికి.. ప్రైమరీ కాంటాక్ట్ గా గుర్తించారు. ఇక.. ఈ రోజు పాజిటివ్ గా తేలిన మరో కేసు విషయానికి వస్తే.. సదరు వ్యక్తి కుత్భాల్లాపూర్ కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఇటీవల అతడు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ మూడు కేసుల్లోనూ విదేశీ పర్యటనలు లేకుండా.. వేరే వారి నుంచి సోకటం బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు. దీంతో.. వైరస్ సోకిన వారి నుంచి మరొకరికి వైరస్ సోకిన వారి సంఖ్య తెలంగాణలో తొమ్మిదికి చేరినట్లైంది.
Tags:    

Similar News