దాయాది ఎంత దారుణానికి పాల్పడ్డాడంటే

Update: 2016-11-23 02:04 GMT
గడిచిన కొద్దిరోజులుగా భారత్.. పాక్ ల మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉరీ ఉగ్రఘటనతో పాక్ పై రగిలిపోతున్న భారత్.. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా.. పాక్ లోని ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక పంపింది మోడీ సర్కారు. అప్పటి నుంచి కుతకుతలాడిపోతున్నా పాకిస్థాన్ లోని ఉగ్రవాదులు.. పాక్ సైన్యం.. అందుకు బదులు తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు.

ఈ క్రమంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ భారత జవాన్లకు.. పాక్ ఉగ్రవాదుల మధ్య భీకర పోరాటం సాగుతోంది. పాక్ తీవ్రవాదులు.. పాక్ సైన్యం వేసే నక్కజిత్తులకు భారత సైన్యం ధీటైన జవాబు ఇస్తోంది. తాజాగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు వీర మరణం పొందారు. అయితే.. వీరిలో ఒక సైనికుడి శరీరాన్ని ఉగ్రవాదులు అత్యంత దారుణంగా.. అమానుషంగా ముక్కలు చేసిన ఘటన చూస్తే విస్మయానికి గురి కావాల్సిందే.

మచ్చల్ సెక్టార్ లో చోటు చేసుకున్న ఈ దారుణంపై దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. తలను వేరు చేసిన ఉగ్రవాదులు.. సదరు వీర సైనికుడ్ని అత్యంత అమానుషంగా చంపినట్లుగా కనిపిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైనికులకు ఎదురుదెబ్బ తగలటం ఇదే మొదటిసారికావటం గమనార్హం. ఈ ఉదంతం వెనుక పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ హస్తం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో అతడిపై పాకిస్థాన్ లోనూ.. ఉగ్రవాద వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నెల 29న రిటైర్ కానున్న ఆయన.. తన పదవీ కాలం ముగిసే లోపు ఏదో ఒక దారుణానికి పాల్పడాలన్న కసితోనే భారత సైనికుడ్ని అత్యంత దారుణంగా హతమార్చినట్లుగా తెలుస్తోంది. అతడి అండతోనే పాక్ లోని ఉగ్రవాదులు భారత సైనికుల మీద తెగబడినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News