ర‌విప్ర‌కాశ్ ను వెతికేందుకు ప్ర‌త్యేక టీంలు!

Update: 2019-05-22 05:00 GMT
మోసం.. ఫోర్జ‌రీ.. అక్ర‌మంగా డేటా త‌ర‌లింపుతో స‌హా రూల్స్ కు భిన్నంగా లోగో అమ్మ‌కం లాంటి నేరారోప‌ణ‌ల‌తో టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ వార్త‌ల్లో నిల‌వ‌టం తెలిసిందే. పోలీసులు నోటీసులు జారీ చేసిన నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన ఆయ‌న క‌నిపించ‌కుండా పోయారు. త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేసేందుకే కేసులు పెట్టార‌ని.. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాలంటూ ర‌విప్ర‌కాశ్ హైకోర్టులో అప్లికేష‌న్ పెట్టుకోవ‌టం తెలిసిందే.

దీనిపై విచార‌ణ‌ను కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండ‌గా.. ర‌విప్ర‌కాశ్ ఎక్క‌డున్నార‌న్న విష‌యంపై సైబ‌రాబాద్ పోలీసుల‌కు ప్రాథ‌మిక స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ.. ఆ విష‌యంలో మ‌రింత ముందుకు వెళ్ల‌కుండా ఉన్నార‌న్న మాట ప్ర‌చారంలో ఉంది. ఆచితూచి అడుగులు వేయాల‌న్న ఉద్దేశంతోనే ఆల‌స్యం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా ర‌విప్ర‌కాశ్ ను వెతికేందుకు మూడు ప్ర‌త్యేక బృందాల్ని ఏర్పాటు చేసిన‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీసులు వెల్ల‌డించారు. ఆయ‌న ఇప్ప‌టికే 30 సిమ్ లు మార్చిన‌ట్లుగా స‌మాచారం ఉన్న సైబ‌రాబాద్ పోలీసుల‌కు.. ఆయ‌న ఎక్క‌డ ఉన్నార‌న్న విష‌యం మీద క్లారిటీ లేకుండా ఉంటుందా? అన్న‌ది ఒక క్వ‌శ్చ‌న్.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ర‌విప్ర‌కాశ్ ఆచూకీ ల‌భించింద‌ని.. ఆయ‌న ఆంధ్రాలోనే ఉన్న‌ట్లుగా క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న తెలంగాణ పోలీసులు.. ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో దూకుడు ప్ర‌ద‌ర్శించ‌టం స‌రికాద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల ఫలితాలు వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ వేచి చూసే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌టం మంచిద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న వారు.. ఫ‌లితం వ‌చ్చాక ర‌విప్ర‌కాశ్ అరెస్ట్ కు ప్లాన్ చేస్తార‌ని చెబుతున్నారు. ఏమైనా ర‌విప్ర‌కాశ్ పోలీసుల అదుపులోకి రావాలంటే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై క్లారిటీ త‌ప్ప‌నిస‌రి అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అప్ప‌టివ‌ర‌కూ పోలీసులు వెతుకుతూనే ఉంటార‌న్న వ్యాఖ్య వినిపించ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News