ఈ జింపింగ్ ఎమ్మెల్యేలు చేసిన ప‌నికి కేసీఆర్ ఫిదా

Update: 2018-03-21 05:11 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ను జంపింగ్ ఎమ్మెల్యేలు ఫిదా చేసేశారు. పార్టీ మార‌డం ద్వారానే గులాబీ ద‌ళ‌ప‌తిని ఖుష్ చేసేస్తే..మ‌ళ్లీ తాజాగా ఎలా మ‌న‌సు గెలుచుకున్నారు అనేదే మీ సందేహమా?  ప్ర‌త్యేకంగా రాజకీయం చేసి కాకుండా...ప్ర‌జా సంక్షేమం కోసం వినూత్న రీతిలో ఆ ఎమ్మెల్యేలు గులాబీ ద‌ళ‌ప‌తి మెచ్చే ప‌నిచేశారు. ఇంత‌కీ ఆ ముగ్గురు ఎవ‌రంటే...టీడీపీ త‌ర‌ఫున గెలిచి టీఆర్ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యే కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ - శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఇంత‌కీ వారేం చేశారంటే...ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్‌ లోని బస్సులో అసెంబ్లీ వరకు ప్రయాణించారు.

మొదట బాచుపల్లిలో బస్సు ఎక్కిన ఎమ్మెల్యే వివేకానంద్ ప్రయాణికులతో ముచ్చటించారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని భాగ్ అమీర్ బస్టాప్‌ లో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ - కూకట్‌ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదే బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా వారు బస్టాపుల్లో వేచి ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. బస్సు ఎక్కిన తర్వాత తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. బస్టాపుల్లో మౌలిక వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆల్ ఇండియా రేడియో బస్‌ స్టాప్ వద్ద దిగిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు.

అనంత‌రం ఈ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నట్టు పలువురు ప్రయాణికులు త‌మ‌ దృష్టికి తెచ్చారని వెల్ల‌డించారు. బస్టాపుల్లో తాగునీటి వసతి - ఉదయం పూట అధికంగా బస్సు సర్వీసుల నిర్వహణ వంటి అంశాలను తక్షణమే ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చిస్తామని - పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికులు తెలిపిన సమస్యలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ - రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి దృష్టికి తీసుకెళి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే వివేకానంద్ సోమవారం కుత్బుల్లాపూర్ నుంచి బస్సులో అసెంబ్లీకి వెళ్లగా - మంగళవారం కూడా బస్సులోనే వెళ్లారు.


Tags:    

Similar News