అలాంటివేళ‌.. అమ్మ వేలిముద్ర‌లు వేశార‌ట‌

Update: 2017-12-08 05:54 GMT
అమ్మ అనారోగ్యం.. అమ్మకు వైద్యం.. అమ్మ మ‌ర‌ణం అంతా అర్థ‌మైన‌ట్లు క‌నిపిస్తూనే.. ఏమీ అర్థం కాన‌ట్లుగా ఉంటుంది. అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చేరిన అమ్మ‌కు అందించిన వైద్యానికి సంబంధించిన స‌మాచారం పూర్తి స్థాయిలో బ‌య‌ట‌కు రాలేదు.  నిత్యం అపోలో ఆసుప‌త్రికి వెళ్లిన అమ్మ వీర విధేయుడు ప‌న్నీర్ సెల్వం లాంటోడికి సైతం.. అమ్మ ద‌ర్శ‌నం కాలేద‌ని.. లోప‌ల‌కు వెళ్ల‌నివ్వ‌లేద‌ని చెప్పుకొచ్చారు.

అమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది ఎవ‌రు? ఎవ‌రు ఉన్నారంటే చిన్న‌మ్మ మాత్ర‌మేన‌ని చెబుతారు. అంతేనా.. ఢిల్లీ నుంచి ప్ర‌త్యేకంగా వ‌చ్చిన రాహుల్ గాంధీ.. జైట్లీ లాంటోళ్లు కూడా అమ్మ‌ను చూడ‌లేద‌ని చెబుతారు. మ‌రి.. వీరంతా ఎవ‌రిని పరామ‌ర్శించేందుకు వ‌చ్చారన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇదిలా ఉండ‌గా.. ఆసుప‌త్రిలో అమ్మ ఉన్న‌ప్పుడు త‌మిళ‌నాడులో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి అన్నాడీఎంకే అభ్య‌ర్థుల బీఫాంపై ఉన్న వేలిముద్ర‌లు అమ్మ‌వేనా? అన్న సందేహంతో పాటు.. అమ్మ బ‌తికి ఉన్న‌ప్పుడు పెట్టిన‌వేనా? అన్న సందేహాలున్నాయి. దీనికి సంబంధించిన విచార‌ణ సంఘం ఏర్పాటైంది. డీఎంకేకు చెందిన ఉప ఎన్నిక అభ్య‌ర్థి డాక్ట‌ర్ శ‌ర‌వ‌ణ‌న్ (తిరుప్ప‌రంకుండ్రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు) ఆరోప‌ణ‌లపై విచార‌ణ సంఘం విచారిస్తోంది.  దీనికి సంబంధించిన విచార‌ణ తాజాగా జ‌రిగింది.

వేలిముద్ర‌ల‌కు సంబంధించి వివ‌రాల కోసం.. అపోలో ఆసుప‌త్రిలో జ‌య చికిత్స‌ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక వైద్య బృందంలోని స‌భ్యులైన డాక్ట‌ర్ బాలాజీ.. షుగ‌ర్ డాక్ట‌ర్ ధ‌ర్మ‌రాజ్ లు విచార‌ణ సంఘం ఎదుట హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఈ ఇద్ద‌రు వైద్యులు స‌మాధానాలు ఇచ్చారు.

అపోలో ఆసుప‌త్రిలో అన్నాడీఎంకే అభ్య‌ర్థుల బీఫాంల‌పై జ‌య‌ల‌లిత వేలుముద్ర‌లు వేసే స‌మ‌యంలో తాను సాక్షిగా వెళ్లాన‌ని.. ఆ స‌మ‌యంలో ఆమె వ‌ద్ద శ‌శిక‌ళ మాత్ర‌మే ఉన్నార‌ని వైద్యులు బాలాజీ పేర్కొన్నారు. అంద‌రూ చెబుతున్న‌ట్లుగా ఆసుప‌త్రిలో చేరిన రెండు వారాల దాకా జ‌య‌ల‌లిత ఇడ్లీలు తిన‌లేద‌ని.. కేవ‌లం ద్ర‌వాహార‌మే తీసుకున్న‌ట్లుగా చెప్పారు.

అమ్మ‌ స్పృహ‌లో ఉన్న‌ప్పుడు వేలిముద్ర‌లు తీసుకున్నామ‌న్నారు. లండ‌న్ కు వెళ్లి చికిత్స తీసుకోవ‌టానికి జ‌య‌ల‌లిత అంగీక‌రించ‌లేద‌న్న విష‌యం ఆసుప‌త్రి వ‌ర్గాల ద్వారా త‌మ‌కు తెలిసింద‌న్నారు. అపోలో వైద్యులు అందించిన చికిత్స‌ల వివ‌రాల్ని వారు విచార‌ణ సంఘానికి వివ‌రించారు. జ‌య అనారోగ్యానికి గురి కావ‌టానికి కార‌ణాల్ని డాక్ట‌ర్ ధ‌ర్మ‌రాజ్ వెల్ల‌డించారు. మొత్తంగా వేలిముద్ర‌లు అమ్మ‌వేన‌ని.. ఆమె స్పృహ‌లో ఉన్న‌ప్పుడే వేసిన‌వ‌న్న విష‌యాన్ని వైద్యులు స్పష్టం చేశారు.
Tags:    

Similar News