కాంగ్రెస్ లో పాత-కొత్త నేతల మధ్య టిక్కెట్ వార్

Update: 2018-10-07 11:34 GMT
ముందొచ్చిన దాని కంటే వెనుకొచ్చిన కొమ్ములదే రాజ్యం అన్నట్లుంది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ టిక్కెట్ వార్ కొత్త - పాత నేతల మధ్య రసవత్తరంగా సాగుతోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు తమదే రాజ్యం అంటుండగా, మేము ఎప్పటి నుంచో ఉన్నాం.. జర ఆగుండ్రి అంటున్నారంట అంతకుముందు ఉన్న నేతలు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ లొల్లి కథ బలాబలాలు నిరూపించుకునేంత స్థాయిలో జరుగుతుంది.

ఆర్మూర్ లో గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు.  దాంతో ఇక్కడ కాంగ్రెస్ తరుపున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది ఇంక తేలలేదు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచర వర్గానికి కూడా అప్పుడే టిక్కెట్ల హామీ తీసుకున్నారట.  

గతంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు  డీ శ్రీనివాస్ అనుచరురాలిగా ఉండి, ఆ తరువాత ఆయనతో విభేదించిన ఆకుల లలిత ఎమ్మెల్సీ అయ్యారు. ఆమె ఎప్పటి నుంచో ఆర్మూర్ లో నెగ్గేందుకు ప్రణాళికగా పని చేసుకుంటూ వస్తున్నారు. తనకు టిక్కెట్ ఇస్తే గెలుపు ఖాయమని కాంగ్రెస్ పెద్దల వద్ద చెబుతున్నారట. అయితే, ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి అనుచరుడు రాజారాం యాదవ్ ఈ సారి ఆర్మూర్ టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ టిక్కెట్ ఒడంబడిక ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి ఆయనకే టిక్కెట్ ఖాయమని అనుచరగణం ప్రచారం కూడా మొదలెట్టేశారు.

దీంతో ఆర్మూర్లో పొత , కొత్త నేతల మధ్య టిక్కెట్ లాబీయింగ్ జోరుగా సాగుతోంది. ఇందులో ఎవరికి టిక్కెట్ దక్కుతుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తుండగా, మరో నేత నేనున్నానంటూ బరిలోకి దిగేందుకు తహతహలాడుతున్నాడు. ఆయనే జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, పీసీసీ కార్యదర్శి చంద్రమోహన్. తనకు ఈ సారి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ మొదలు పెట్టారట.

టిక్కెట్ కోసం ద్విముఖ పోరు కొనసాగుతుండగా, మరొకరి రాకతో త్రిముఖ పోరు అయిపోయింది. కొసమెరుపు ఏంటంటే ఎవరికి వారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేయడం. తనకంటే తనకు ఖచ్చితంగా సీటు వస్తుందని ధీమాలో   గ్రౌండ్ లో దూకి తెగ తిరిగేస్తున్నారు. అసలు టిక్కెట్ ఎవరకి వస్తుందో తెలియక కాంగ్రెస్ శ్రేణులు తికమకలో పడిపోగా, ఆకుల లలిత, రాజారాం అనుచరులు వర్గాలుగా చీలిపోయి పోటోపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఆర్మూర్ టిక్కెట్ విషయంపై పీసీసీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.  ఎవరికి కాదంటే ఎవరు కినుక వహిస్తారోనని బుజ్జగించే పనిలో పడిపోయారని వినికిడి.
Tags:    

Similar News