తెలుగోడు తిలక్ వర్మ దశ తిరిగింది!

Update: 2022-02-13 11:48 GMT
హైదరాబాద్ యువ బ్యాట్స్ మన్ తిలక్ వర్మ దశ తిరిగింది. వేలంలో అతడికి ఏకంగా రూ.1.70 కోట్లు ధర దక్కింది. అందులోనూ అతడిని చేజిక్కించుకున్నది సాదాసీదా జట్టు కాదు. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ గూట్లో పడ్డాడు 19 ఏళ్ల తిలక్. చిన్న వయసులో పెద్ద టోర్నీలాడి టన్నుల కొద్దీ పరుగులు చేసిన తిలక్ వర్మ మూడేళ్ల క్రితమే పెద్ద క్రికెటర్ అవుతాడని అనుకున్నారు. కానీ, మధ్యలో కొంత ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. అయితే, తిరిగి పుంజుకొని ఇటీవల మంచి స్కోర్లతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ఇతడికి నిలకడగా ప్రతిభ చాటితే టీమిండియాలో ఆడే అవకాశం వస్తుందని అంచనాలున్నాయి.

ఏకంగా ముంబై ఇండియన్స్ కు..
ఓ విధంగా తిలక్ కు తాజా వేలం జాక్ పాటే కాదు అంతకుమించి. హైదరాబాద్ తరఫున ఎంత ఆడినా అతడికి పెద్దగా పేరు రాలేదు. ఇకపై మాత్రం తిలక్ రాత మారిపోతోందని చెప్పవచ్చు. ముంబై ఇండియన్స్ మామూలు జట్టు కాదుగా మరి. అందులోనూ దాని కెప్టెన్ రోహిత్ శర్మ.

మరింకేం తిలక్ కు కావాల్సింది వెదుక్కుంటూ వచ్చింది. వచ్చే సీజన్ లో అతడు నిలకడగా ఆడితే టీమిండియా ముంగిట నిలిచినట్లే్. పైగా తిలక్ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్. ఇలాంటి ఆటగాళ్లు టీమిండియాకు ప్రస్తుతం చాలా అవసరం. ఇషాన్ కిషన్ ను ఈ కోణంలోనే ప్రత్యేకంగా చూస్తున్నారు.

 ధావన్ ఒకటీ,రెండేళ్లలో రిటైరైతే.. తిలక్ ఆ స్థానానికి గట్టిపోటీదారుగా మారొచ్చు.పైగా ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం తిలక్ కు రానుంది. అదే జరిగితే అతడంత జాతకమంతుడు ఈ లీగ్ వేలంలో మరొకరు ఉండరు.

అండర్ 19 చాంపియన్లు వేలానికొచ్చారు..
ఇటీవలి అండర్ 19 ప్రపంచ కప్ కొట్టిన వారిలో ఆల్‌రౌండర్‌ రాజ్‌వర్ధన్‌ను రూ.1.50 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. కప్‌లో రాణించిన టీమ్‌ఇండియా ఆటగాడు రాజ్‌బవాను రూ. 2 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. ఇతడి కనీస ధర రూ. 20 లక్షలు. అండర్‌-19 కెప్టెన్‌ యశ్‌ధుల్‌కు మాత్రం రూ.50 లక్షలే దక్కాయి. ఇతడిని సొంత ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.

లివింగ్‌స్టోన్‌కు పెద్ద మొత్తం.. మోర్గాన్‌, మలన్‌, ఫించ్‌లకు నిరాశ
ఐపీఎల్‌ 2022 మెగా వేలం రెండో రోజు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వేలంలోకి వచ్చిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. అతడిని పంజాబ్‌ కింగ్స్‌ రూ.10.5 కోట్లకు దక్కించుకొంది. మరోవైపు కీలక ఆటగాళ్లుగా పేరున్న ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, ముంబయి ఇండియన్స్‌ లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సౌరభ్‌ తివారి, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ఫించ్‌, టీమ్‌ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారాలను ఎవరూ కొనుగోలు చేయలేదు.

ఇక పంజాబ్‌.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌ను రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. మిగతావారిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మార్కో జెన్‌సన్‌ను రూ.4.20 కోట్లకు తీసుకుంది. అలాగే టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై అత్యధిక ధర రూ.9.25 కోట్లకు కొనుగోలు చేయగా ఈసారి అతడి ధర అమాంతం పడిపోయింది. కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ రూ.90లక్షలకే దక్కించుకుంది.
Tags:    

Similar News