'ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ' ఎందాకా వ‌చ్చిన‌ట్టు?

Update: 2022-11-14 09:30 GMT
'ప్రజాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ ధ్యేయంగా చేతులు క‌లుపుతున్నాం!' అని టీడీపీ అదినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న చేసి నెల రోజులు అయింది. అయితే, ఈ నెల రోజుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఇరువురు నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.

అంతేకాదు, ఎలాంటి కార్యాచ‌ర‌ణ‌కు సంబంధించిన సంకేతాలు కూడా వెల్ల‌డికాలేదు.  నిజానికి ఆరోజు విశాఖ‌లో జ‌రిగిన ఘ‌టన అనంత‌రం.. ఆవేశంగా విజ‌య‌వాడ‌కు చేరుకున్న ప‌వ‌న్ .. త‌ర్వాత త‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే చెప్పు చూపిస్తూ వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఈ స‌మ‌యంలోనే నేరుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ప‌వ‌న్ వ‌ద్ద‌కు వెళ్లి చేతులు క‌లిపారు. ఇద్ద‌రూ క‌లిసి సంయుక్తంగా మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే, ఈ స‌మ‌యంలో ఇద్ద‌రు కూడా తాము ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు చేతులు క‌లుపుతున్నామ‌ని, ప్ర‌జ‌ల కోసం ఒక సంక్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు.

దీంతో ఇంకేముంది, రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఇరు పార్టీల నాయ‌కులు సంయుక్తంగా పోరాటాలు చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఇరువురు నాయ‌కులు ఎదురు ప‌డిన సంద‌ర్భం కానీ, మ‌రో వ్యూహం కానీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇంత‌లోనేటీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అయ్య‌న్నాపాత్రుడిని అరెస్టు చేయ‌డం, ఆయ‌న కుమారుల‌పై కేసులు పెట్ట‌డం కూడా తెర‌మీదికివ‌చ్చాయి.

మ‌రి ఇంత జ‌రిగినా టీడీపీ+జ‌న‌సేన ఉమ్మ‌డిగా ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌ను ప‌ట్టించుకోలేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు అనంత‌పురంలో డీఎస్పీ  స్థాయి అధికారి ఒక‌రు టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి వాటిని కూడా ప‌ట్టించుకోలేదు. ఇక‌, సాధార‌ణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తామ‌ని సంక‌ల్పం చెప్పుకొన్నారు.

దానిని కూడా ప‌క్క‌న పెట్టారు. ఇలా ఎటుచూసినా ఈ నెల రోజుల్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నా.. ప‌వ‌న్ కానీ, చంద్ర‌బాబు కానీ సంయుక్తంగా ఎలాంటి కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వీరి ప‌రిర‌క్ష‌ణ ఆగిపోయిందా?  లేక ముందుకు సాగుతుందా?  చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News