నామినేష‌న్ల ఘ‌ట్టానికి తెర‌!... పోలింగే త‌రువాయి!

Update: 2019-03-28 11:57 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా తొలి ద‌శ ఎన్నిక‌లు, ఏపీ అసెంబ్లీకి జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ఘ‌ట్టం ముగిసింద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే వెలువ‌డిన షెడ్యూల్ ప్ర‌కారం మొన్న సోమ‌వారం వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ఇచ్చిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం... నేటితో నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసిపోయిన‌ట్టుగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే అందిన నామినేష‌న్ల‌పై స్క్రూటినీ చేసిన ఎన్నిక‌ల సంఘం... అర్హులెవ‌రు? అన‌ర్హులెవ‌ర‌న్న విష‌యాన్ని నిన్న‌టికే ప్ర‌కటించేసింది. బ‌రిలో ఎంత‌మంది నిలిచార‌న్న విష‌యాన్ని కూడా స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా త‌మ నామినేష‌న్ల‌ను విత్ డ్రా చేసుకునేందుకు నేటి సాయంత్రం వ‌ర‌కు గ‌డువు ఇచ్చిన ఈసీ... కాసేప‌టి క్రితం ఆ గ‌డువు కూడా ముగిసిపోయింద‌ని ప్ర‌క‌టించింది. అంతేకాకుండా నామినేష‌న్ వేసి, అర్హ‌త సాధించి, నామినేష‌న్ల‌ను విత్ డ్రా చేసుకోకుండా బ‌రిలోనే నిలిచిన అభ్య‌ర్థులు ఎవ‌ర‌న్న విష‌యంపైనా ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. అభ్య‌ర్థుల జాబితాను కూడా ప్ర‌క‌టించేసింది. ఇక పోలింగే త‌రువాయిగా మారింది.

వ‌చ్చే నెల 11న జ‌ర‌గ‌నున్న పోలింగ్ లో ఇటు ఏపీలో అసెంబ్లీ, లోక్ స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, తెలంగాణలో మాత్రం లోక్ స‌భ ఎన్నిక‌లు మాత్రం జ‌ర‌గ‌నున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటుగా దేశంలోని 20 రాష్ట్రాల‌కు చెందిన మొత్తం 91 లోక్ స‌భ సీట్ల‌కు తొలి విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిస్తారు. దేశవ్యాప్తంగా మరో ఆరు విడుతల్లో ఎన్నికలు జరిగాక .. మే 23న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఇదిలా ఉంటే... తెలంగాణ‌లోని కీల‌క స్థానంగా భావిస్తున్న నిజామాబాద్ లోక్‌ సభ స్థానం ఆసక్తి రేపింది. ఇక్కడినుంచి ప్రధాన పార్టీలు కలిపి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 178 మంది రైతులు పోటీ చేస్తున్నారు. పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందున భారీ సంఖ్య‌లో రైతులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూతురు క‌విత ఆ పార్టీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News