ఆ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ కాల ప‌రిమితి ఎంత‌?

Update: 2019-03-08 04:31 GMT
లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు..నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఇవి ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. లెక్క ప్ర‌కారం చూస్తే.. ఇప్ప‌టికే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావాల్సి ఉంది. అయితే.. అలా జ‌ర‌గ‌లేదు. దీనిపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతుండ‌గా.. మ‌రోవైపు ఈ నెల 12లోపు షెడ్యూల్ విడుద‌ల కావ‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

తొలుత తొమ్మిది లోపు ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డుతుంద‌న్న అంచ‌నాలు బ‌లంగా వినిపించాయి. దీనికి త‌గ్గ‌ట్లే ఈసీ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన సంకేతాలు ఇందుకు త‌గ్గ‌ట్లే ఉన్నాయి. కానీ.. అందుకు భిన్నంగా షెడ్యూల్ విడుద‌ల‌లో జాగు క‌నిపిస్తోంది. ఇదంతా ప్ర‌ధాని మోడీకి అనుకూలంగా ఉండేలా జ‌రుగుతుంద‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తున్నా.. అదేమీ లేద‌న్న వాద‌న‌ను మ‌రికొంద‌రు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌.. సిక్కిం.. ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ నుంచి మే వ‌ర‌కూ ఏడెనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొత్తంగా పూర్తి అవుతుంద‌ని చెబుతున్నారు. మొద‌టి విడ‌త‌కు ఈ నెలాఖ‌రులో నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంద‌ని.. ఏప్రిల్ ప్ర‌థ‌మార్థంలోపోలింగ్ జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. క‌శ్మీర్ అసెంబ్లీకి తాజా ఎన్నిక‌ల‌తో క‌లిపి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించే అవ‌కాశాల్ని ఈసీ ప‌రిశీలిస్తుంది. అయితే.. ఆ రాష్ట్రంలో నెల‌కొన్న శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి కార‌ణంగా.. లోక్ స‌భ‌.. అసెంబ్లీ ఎన్నిక‌లు ఒకేసారి జ‌ర‌ప‌టానికి కేంద్రం.. గ‌వ‌ర్న‌ర్ స‌త్య‌పాల్ మాలిక్ సుముఖంగా లేర‌న్న మాట వినిపిస్తోంది.

మ‌రోవైపు ఒక్కో రాష్ట్ర అసెంబ్లీ కాల‌ప‌రిమితి ఒక్కోలా ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ కాల‌ప‌రిమితి జూన్ 18 వ‌ర‌కు ఉంటే.. సిక్కిం శాస‌న స‌భ గ‌డువు మే 27 వ‌ర‌కుంది. ఇక‌.. ఒడిశా అసెంబ్లీ కాల‌ప‌రిమితి జూన్ 11 వ‌ర‌కు.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ కాల‌ప‌రిమితి జూన్ ఒక‌టి వ‌ర‌కూ ఉంది. ఆయా అసెంబ్లీల‌ కాల‌ప‌రిమితి లోపు.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి.. అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌టానికి త‌గిన‌ట్లుగా ప‌రిస్థితులు ఉండ‌టానికి అనువుగా ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. 
Tags:    

Similar News