మోదీ అనుకూల స‌ర్వే....ఏపీలో 7 ఎంపీ సీట్ల‌ట‌!

Update: 2018-08-15 13:14 GMT
2019లో జ‌ర‌గ‌బోతోన్న సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రి కొద్ది నెల‌లే స‌మ‌యం ఉండ‌డంతో దేశంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతోంది. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ పార్టీలు రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపే ప‌ర‌మావ‌ధిగా వ్యాహాలు ర‌చిస్తున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపెవ‌రిదంటూ....ఇప్ప‌టి నుంచే కొన్ని చానెళ్లు స‌ర్వేలు మొద‌లు పెట్టాయి. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ జాతీయ న్యూస్ చానెల్ టైమ్స్ నౌ చేప‌ట్టిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. భార‌త దేశ ప్ర‌జ‌లు మ‌రోసారి మోదీకే ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది. 2019లో బీజేపీకి 227 లోక్ స‌భ స్థానాలు వ‌స్తాయ‌ని పేర్కొంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ 78 స్థానాలకే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని తెలిపింది. మిగిలిన పార్టీల‌ల్నింటికి క‌లిపి 238 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. ఏపీలో ఈ సారి బీజేపీ హ‌వా ఉంటుంద‌ని, ఆ పార్టీ 7 ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని ఆ స‌ర్వేలో వెల్ల‌డైంది. దాంతోపాటు కాంగ్రెస్ 3 స్థానాలు ద‌క్కించుకుంటుంద‌ని తెలిపింది. మిగిలిన 15 సీట్లు ....టీడీపీ - వైసీపీలు పంచుకుంటాయ‌ని వెల్ల‌డించింది. 25 రాష్ట్రాల్లోని 156 పార్ల‌మెంటు స్థానాల్లో 13వేల మందిపై నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయ‌ని తెలిపింది.
 
ప్ర‌స్తుతం ఈ స‌ర్వే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్ర‌స్తుతం దేశంలో బీజేపీకి దాదాపుగా వ్య‌తిరేక‌ పవ‌నాలు వీస్తున్న నేప‌థ్యంలో....ఈ త‌ర‌హా గ‌ణాంకాలు బీజేపీకి అనుకూలంగా రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. మోదీ మళ్లీ ప్రధాని అవుతారా లేదా అన్న సంగ‌తి అటుంచితే....ఏపీ లోక్ స‌భ స్థానాల విష‌యంలో స‌ర్వేలో వెల్ల‌డైన విష‌యాలు వాస్త‌వ దూరంగా క‌నిపించ‌క మాన‌వు. ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ ను విభ‌జించిన కాంగ్రెస్ పై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. అస‌లు ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్ర‌శ్నార్థ‌కం....ఏపీలో కాంగ్రెస్ కు పెద్ద‌గా బ‌లం లేద‌న్న సంగ‌తిని నిన్న రాహుల్ గాంధీ స్వ‌యంగా  వెల్ల‌డించారు. అటువంటిది ఆ పార్టీకి 3లోక్ స‌భ స్థానాలు ద‌క్కుతాయ‌ని వెల్ల‌డించ‌డం విశేషం. ఇక‌, హోదా ఇస్తామ‌ని ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన బీజేపీపై న‌వ్యాంధ్ర ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. అటువంటిది, ఏపీలో ఈసారి బీజేపీకి 7లోక్‌ సభ స్థానాలు వ‌స్తాయ‌ని చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఏపీలో దాదాపుగా 2014లో కాంగ్రెస్ కు ఎదురైన పరిస్థితి....ఈ సారి బీజేపీకి ఎదురుకాబోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ స‌ర్వే వెల్ల‌డి కావ‌డం విశేషం.

2014లో టీడీపీ - జనసేనలతో పొత్తు పెట్టుకున్న‌....బీజేపీ 4 ఎంపీ సీట్లలో పోటీ చేసి రెండు చోట్ల నెగ్గింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీతో పొత్తుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. అటువంటిది ఈ సారి ఒంట‌రిపోరు చేయ‌బోతోన్న బీజేపీ...రాబోయే ఎన్నికల్లో 7లోక్‌ సభ సీట్లను ఎలా కైవసం చేసుకుంటుందన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ హామీని ఏపీ ప్రజలు విశ్వసించారా ...లేదా అన్న‌ది ప‌క్క‌న‌బెడితే....కాంగ్రెస్ పై వ్య‌తిరేక‌త మాత్రం తీవ్రంగా ఉంద‌నేది సుస్ప‌ష్టం. వాస్త‌వానికి - ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు తిరుగుండ‌ద‌ని....ఆయ‌నే సీఎం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ‌తుతున్నారు. ఇటు అసెంబ్లీ...అటు పార్ల‌మెంటు స్థానాల్లో వైసీపీకి టీడీపీ కొద్దిగా పోటీ ఇచ్చే అవ‌కాశ‌ముంది. కానీ, వైసీపీని ఢీకొట్టే స్థితిలో టీడీపీ లేద‌ని ఇప్ప‌టికే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోక్ స‌భ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, జ‌న‌సేన‌లు అస‌లు ఖాతా తెర‌వ‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అటువంటిది...టీడీపీ - వైసీపీలు 15స్థానాలకే పరిమితమవుతాయని సర్వే వెల్లడించడం గ‌మ‌నార్హం. ఏది ఏమైనా...మోదీకి అనుకూలంగా....ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బ‌ల‌ప‌డుతోంద‌ని చెప్ప‌డం ఈ స‌ర్వే ప్ర‌ధానోద్దేశ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ స‌ర్వేపై బీజేపీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా....వైసీపీ - టీడీపీ శ్రేణులు న‌వ్వుకుంటున్నాయి.

Tags:    

Similar News