తిరుమల వెంకన్నకు తప్పని కరోనా కష్టాలు.. గత ఏడాది నష్టం ఎంతంటే !

Update: 2021-07-17 07:09 GMT
కలియుగ వైకుంఠ దైవం...ఆ ఏడు కొండలవాడు కొలువై ఉన్న అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది. స్వామివారి హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. శ్రీవారి హుండి ఆదాయాలపై కరోనా కారణంగా చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం భారీ ప్రభావాన్ని చూపింది. దేశంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయం అయిన తిరుమలలో గత ఏడాది కాలంలో హుండి ఆదాయం రూ. 800 కోట్లకు పైగా నష్టపోయినట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

2020 ఫిబ్రవరిలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు తన 2020-21 వార్షిక బడ్జెట్‌ను రూ .3,310 కోట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇది హుండి రాబడిని 1,351 కోట్ల రూపాయలుగా చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల కాలంలో కరోనా లాక్ డౌన్ ప్రభావంతో స్వామి వారి ఆదాయానికి భారీగా గండిపడింది. కరోనా లాక్డౌన్ కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వరుసగా 84 రోజుల పాటు మూసివేయబడింది. అయితే స్వామి వారికి జరిగే నిత్యా కైంకర్యాలు మాత్రం నిర్వహిస్తూ వచ్చారు. గత సంవత్సర కాలంగా తిరుమలలో విధించిన కరోనా లాక్ డౌన్ , ఆ తర్వాత తిరుమలకు భక్తులు పెద్దగా వెళ్లకపోవడం, కరోనా నిబంధనలు, భక్తులను అధిక సంఖ్యలో అనుమతించకపోవడం వంటి అనేక కారణాలు స్వామి వారి ఉండి ఆదాయం తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు.

2020 మార్చి 21వ తేదీన తిరుమల ఆలయాన్ని కరోనా కారణంగా మూసివేసిన ఆలయ సిబ్బంది మళ్లీ గత ఏడాది జూన్ 11న తిరిగి తెరచారు. అయినప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో భక్తులు చాలా తక్కువ సంఖ్యలో తిరుమలకు వెళ్లడంతో హుండీ ఆదాయానికి గండి పడింది. అయితే, కరోనా నియమాలతోనే ఏడాది పొడవునా పరిమిత సంఖ్యలో భక్తులను మాత్రమే అనుమతించారు, తద్వారా హుండి ఆదాయం, టిటిడి యొక్క ఇతర ఆదాయాలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా, తిరుమల దేవాలయంలో రోజుకు దాదాపు 60,000-90,000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు . ప్రత్యేక రోజులు మరియు వారాంతాల్లో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య లక్ష కూడా దాటిపోతుంది.

అలాగే , హుండిలోకి భక్తులు వేసే కానుకల ద్వారా ఈ పుణ్యక్షేత్రం రోజుకు రూ .3 కోట్ల నుంచి రూ .4 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. నెలవారీ హుండీ ఆదాయం రూ .100 కోట్ల నుండి రూ .150 కోట్ల మధ్య ఉంటుంది. కరోనా కారణంగా రోజుకు అనుమతించే భక్తుల సంఖ్య పై విధించిన ఆంక్షలు హుండి ఆదాయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. అధికారిక రికార్డుల ప్రకారం, గత సంవత్సరం ఏప్రిల్ మరియు మే నెలల్లో, హుండి ఆదాయం వరుసగా రూ .10.50 లక్షలు మరియు రూ. 35.97 లక్షలు, అప్పుడు భక్తులు ముడుపులు ఆన్ లైన్ ద్వారానే చెల్లించారు. కరోనా మహమ్మారి నేపద్యంలో ఆలయం పూర్తిగా మూసివేయబడింది. జూన్ 11 న యాత్రికుల కోసం తిరిగి తెరిచిన తరువాత, ఆ నెలలో హుండి ఆదాయం రూ .1.1 కోట్లు , జూలైలో రూ .16.69 కోట్లు, రూ. 18.43 కోట్లు ఆగస్టులో, రూ. 32.04 కోట్లు సెప్టెంబర్‌ లో, రూ. 47.52 కోట్లు అక్టోబర్‌ లో, నవంబర్‌ లో రూ. 61.29 కోట్లు. గత ఏడాది డిసెంబర్‌ లో హుండి ద్వారా భక్తుల నుండి రూ .79.64 కోట్లు వసూలు చేయడంతో సాధారణ స్థితికి వచ్చింది.

ఇక 2021 సంవత్సరంలో జనవరిలో రూ.83.92 కోట్లకు, ఫిబ్రవరిలో రూ .90.45 కోట్లకు, మార్చిలో రూ .104.42 కోట్లకు స్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది . ఆ తర్వాత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతించే భక్తుల సంఖ్యపై మరోసారి ఆంక్షలను తీసుకొచ్చింది. ఈ విధంగా హుండి ఆదాయం మళ్లీ ఏప్రిల్‌ లో రూ .62.69 కోట్లకు పడిపోయింది. మేలో రూ .11.95 కోట్లకు తగ్గింది. అయితే జూన్‌ లో స్వామి వారి హుండీ ఆదాయం కొంచెం పెరిగి రూ. 36.01కోట్లుగా ఉంది.

ఇక ఇదిలా ఉంటే మరోవైపు తిరుమలకు వెళ్లే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది. ఆన్‌ లైన్‌ లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు తమ దర్శన తేదీని మార్చుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది. అయితే ఏడాది లోపు ఒకసారి మాత్రమే ఈవిధంగా మార్పునకు అవకాశం ఉంటుంది. కొవిడ్ - 19 వ్యాప్తి ఉండటంతో భ‌క్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి తమకు సహకరించాలని కోరారు.


Tags:    

Similar News