లైవ్ పోలింగ్ అప్డేట్ : సాగర్ , తిరుపతి ఉప ఎన్నిక ... బెంగాల్ లో ఐదో విడత !

Update: 2021-04-17 07:46 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.  నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు ఉదయం నుండి కొనసాగుతుంది.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో 41 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నియోజక వర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు.  నాగార్జునసాగ‌ర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొన‌సాగుతుంది. ఉదయం పదకొండు గంటల వరకు 31 శాతం పోలింగ్ అయినట్టు అధికారులు తెలియజేశారు. కాగా 2018 సాధరణ ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ అయింది. అయితే కరోనా నేపథ్యంలో రెండు గంటలపాటు అదనంగా సమయం కేటాయించింది ఈసీ, కాగా ఉదయం రెండు మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ నమోదయింది.

ఇకపోతే , తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్ కూడా ప్రశాంతంగా కోనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలున్న ఓటర్లు ఓటు వేయడానికి సాయంత్రం ఆరు గంటల నుంచి అనుమతిస్తారు. గతంలో ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఉండగా క్యూలైన్లలో ఒత్తిడిని తగ్గించడానికి ఇప్పుడు ప్రతి 1,000 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17,11,195 మంది ఓటర్లు తేల్చనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఒకసారి పరిశీలిస్తే .. ‌సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 27 శాతం,,గూడూరు నియోజకవర్గ పరిధిలో 24.5 శాతం , సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో 25 శాతం,వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం,తిరుపతి నియోజకవర్గ పరిధిలో 24 శాతం, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 26.2 శాతం,సత్యవేడు  నియోజకవర్గ పరిధిలో 22.6 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 12 వరకు అత్యధికంగా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో 35 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇప్పటికే దాదాపుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల ఉప ఎన్నిక పరిస్థితి ఇలా ఉంటే , ఈ రోజు వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 36.2 శాతం ఓటింగ్‌ జరిగింది. బెంగాల్ లో మొత్తం 8 దశల్లో పోలింగ్ జరగనున్నట్టు ఈసీ ప్రకటించింది.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో ఈ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో ఇక్కడ ఎలాగైనా పట్టు నిలబెట్టుకోవాలని టీఎంసీ, పట్టు సాధించాలని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేశాయి. కాగా, రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకు గానూ ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతలలో 135స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇంకా పోలింగ్ జరగాల్సిన స్థానాలు 159.  ఐదో విడతలో 45 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతుంది.
Tags:    

Similar News