పార్టీకి సమస్యగా మారాడా ?

Update: 2021-04-14 05:36 GMT
ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి ఇన్చార్జిగా వచ్చిన వ్యక్తి పార్టీ వ్యవహారాలు చూసుకుని వెళిపోతారు. కానీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ మాత్రం పార్టీకి గుదిబండగా మారినట్లు అనుమానంగా మారింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల సందర్భంగా ప్రచారంలో సునీల్ ప్రస్తావిస్తున్న విషయాలు పార్టీకి ఏమాత్రం ఉపకరించకపోగా రివర్సవుతున్నాయి. దీంతో పార్టీకి ఇన్చార్జే సమస్యగా మారాడా అనే అనుమానాలు పార్టీ నేతల మధ్యే చర్చలు జరుగుతున్నాయి.

ఉపఎన్నికలు మొదలైన దగ్గర నుండి అనవసర విషయాలపైనే సునీల్ ప్రధానంగా మాట్లాడుతున్నారు. సునీల్ ప్రస్తావిస్తున్న విషయాల్లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి మతం, గురుమూర్తి తిరుమలలో శ్రీవారిని ఇంతవరకు ఎందుకు దర్శనం చేసుకోలేదు, అభ్యర్ధి క్రిస్తియన్ అని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా లేవనెత్తుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసీపీ అభ్యర్ధి హిందువు కాదని, ఎస్సీ కాదని ఆరోపిస్తున్న సునీల్ అందుకు తన దగ్గరున్న ఆధారాలను చూపించటంలేదు. తిరుమల శ్రీవారిని ఎందుకు దర్శనం చేసుకోలేదని ప్రశ్నించటంలో కూడా అర్ధంలేదు. తిరుమల శ్రీవారిని దర్శించుకోకపోతే ఇక హిందువు కానట్లేనా ? చర్చికి వెళ్ళి అభ్యర్ధి ఫాస్టర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు కాబట్టి కచ్చితంగా క్రిస్తియనే అంటున్నారు.

సునీల్ అయినా వీర్రాజు అయినా మరచిపోయిన విషయం ఏమిటంటే ఎన్నికలో పోటీ చేసేవాళ్ళు చర్చి, గుడి, మసీదుకు వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు.  బహిరంగ వేదికల మీద కూడా మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవటం అందరికీ తెలిసిందే. సరే ఈ విషయాన్ని వదిలేస్తే వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశాన్ని కూడా సునీల్ పదే పదే ప్రస్తావిస్తున్నారు.

నిజానికి వివేకా హత్య విషయంపై తిరుపతి జనాలకు ఏమాత్రం ఆసక్తిలేదు. ఎందుకంటే వివేకానందరెడ్డికి తిరుపతి జనాలకు ఏమాత్రం సంబంధంలేదు. ఎప్పుడైనా తిరుపతికి వచ్చినా పనిమీద వచ్చి వెళ్ళిపోవటమే తప్ప అంతకుమించి వివేకాకు తిరుపతితో పెద్దగా సంబంధాలు లేవు. తన ప్రచారంలో ఎప్పుడైతే ఓసారి హత్య అంశాన్ని ప్రస్తావించటంలో తప్పులేదు. 24 గంటలూ దాన్నే పట్టుకుని ఊగులాడితే కష్టమే.

ప్రభుత్వంలో అవినీతి జరిగినా, పథకాల అమలులో అవకతవకలు లాంటి అంశాలపై ఏదైనా మాట్లాడితే జనాలు వింటారు. అంతకుమించి తిరుపతి అభివృద్ధిలో కేంద్రప్రభుత్వం పాత్ర ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. వకీల్ సాబ్ సినిమా హిట్ అయ్యింది కాబట్టి బీజేపీ గెలుపు కూడా ఖాయమనే చీప్ వ్యాఖ్యలు సునీల్ స్ధాయి ఏంటో చెప్పకనే చెబుతోంది. అందుకనే సునీల్ పార్టీకి సమస్యగా మారినట్లు నేతలే చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News